calender_icon.png 22 September, 2024 | 8:59 AM

గోండు సంగీతం గుమేల

18-09-2024 12:00:00 AM

తంత్రీ వాద్యాల తర్వాత వైవిధ్యత, విలక్షణత కలిగినవి డోలు వాద్యాలు. వీటిని రెండు చేతులతో వాయిస్తారు. లేదా రెండు కర్రలతో రెండువైపులా వాయిస్తారు. చర్మంతో కప్పిన ఈ ‘అనవద్ద వాయిద్యాలు’ అతిప్రాచీనమైనవి. భరతుని నాట్యశాస్త్రానికి ముందు నుంచి కూడా ఇవి మనుగడలో ఉన్నాయి. ఈ గ్రంథంలో డోలు వాద్యాలను (పుష్కర) విశ్వకర్మ ఎంతో నైపుణ్యంతో చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇలాంటి కొన్ని వ్యాద్యాలు పంచాణం వారే తయారుచేస్తారు. చాలా వాద్యాలు ఆయా కళాకారులే తయారుచేయడం, మరమ్మత్తులు చేయడం సాధారణం.

మట్టి డోళ్ళు, కర్ర డోళ్ళు సిలెండర్ అగంతో తయారుచేసి రెండు వైపుల చర్మం కప్పుతారు. వివిధ ఆకారాలతో, రకరకాల శబ్దాలు వచ్చేవిధంగా వీటిని తయారుచేస్తారు. వీటిని వాయించే నేర్పు కొందరికే ఉంటుంది. ఒక్కోరకం డోలు (కూజా ఆకారం, మూకుడు ఆకారం, కుండ ఆకారం మొదలైనవి) ఒక గుంపు, తెగ, ఉపకులం వారే ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా వారే దీనిని వాయించాలని, ఉపయోగించాలనే నియమం ఉంది. వీరణాలను తెరచీరలవారు, కోయడోలు డోలీ కోయలు, ఒగ్గుడోలు ఒగ్గువారు ఇలా సుమారు ఇరవై చర్మవాద్యాలనీ ఇరవై రకాలవారు ఉపయోగిస్తారు. ఒకరు వాయించే డోలుని లేదా వాద్యాన్ని మరొకరు తాకకూడదు. వాయించకూడదు. అంటే కులం, మతం, వర్ణ వ్యవస్థ ప్రకారం సంగీత వాద్యాలని ఉపయోగించే విధానం ఉంది. అంతేకాని వినోదానికి, విందులకు వాటిని ఉపయోగించరాదు. (బుర్ర, డింకీ, గుమ్మట్, గుమేలా, డోలు మొదలైనవి)

కూజానీ సురాయి అంటారు. ఈ ఆకారంలో కూడా చర్మ వాద్యాలున్నాయి. గుమేల బిందె ఆకారం గల చర్మవాద్యాలు, గుండ్రటి పొట్ట, పొడవాటి మెడ గల వాద్యాలు కొన్ని ఉన్నాయి. వీటిని ఒకవైపు అడుగుభాగాన్ని చర్మంతో బిగిస్తారు. మరాఠ్వాడ ప్రాంతంలో ‘గుమట్’ వ్యాదం ఉంది. కర్ణాటకలో, గోండులు నివసించే ఆదిలాబాదు ప్రాంతంలో గుమట్లు ఎక్కువగా వాడతారు. గుమట్ వాద్యాన్నీ గుమేలా అంటారు. ఇది ఎక్కువగా పక్కవాద్యంగా ఉపయోగపడుతుంది.

చాలా మంది స్త్రీలు దీనిని వాయించగలరు. వారు కథాగానం చేసేప్పుడు స్త్రీలు వంతలుగా పాడుతూ డింకి వాయిస్తారు. గోండు సమాజంలో దండారి నృత్యం చేసేప్పుడు పురుషులు పాటలు పాడుతూ దీనిని వాయిస్తారు. వలయాకార నృత్యం చేసేప్పుడు నృత్యకారులకు ఊపు వచ్చేలా ఈ శబ్దం ఉపకరిస్తుంది. గోండీ దేవతల కథలు గానం చేసేప్పుడు గుమేలాది ప్రధాన భూమిక. గోండులలో గల నాలుగో ‘సగ’ (గోత్రం) ఈ వాద్యాన్ని దండారి దేవతగా భావిస్తారు. శారద వాద్యం వాయిస్తూ కథ చెప్పేప్పుడు, వేణువు మోగించేప్పుడు, తాళాలు వాయించేప్పుడు గుమట్ లేదా గుమేలా వాయిస్తారు.