calender_icon.png 20 September, 2024 | 5:19 AM

గోమాత రాష్ట్ర మాత

20-09-2024 02:54:21 AM

దేశం కోసం.. గోవు కోసం దేశవ్యాప్త యాత్ర

స్వామి ముకుందానందజీ వెల్లడి

అక్టోబర్ 9న రవీంద్రభారతిలో  జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్‌జీ ‘గో మహాసభ’

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19(విజయక్రాంతి) : గోమాత రాష్ట్ర మాత అని, గోమాతను రక్షించుకుందామని జ్యోతిర్మఠ్ స్వామి ముకుందానందజీ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‘గో ప్రతిష్ఠా ఆందోళన’, ‘గోధ్వజ స్థాపన భారత్ యాత్ర  2024’ షెడ్యూల్ వివరాలను తెలంగాణ రాష్ట్ర శంకరాచార్య స్వాగత కమిటీ చైర్మన్, ‘విజయక్రాంతి’ దినపత్రిక చైర్మన్ చిలప్పగారి లక్ష్మీరాజంతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్‌జీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న అయోధ్య రామమందిరం నుంచి యాత్ర ప్రారంభమై అక్టోబర్ 26 వరకు గోప్రతిష్ఠా యాత్ర 2024 జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ యాత్రలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ప్రతీ రోజు ఒక చోట గోధ్వజాన్ని ప్రతిష్ఠించబోతున్నట్లు, సందేశమివ్వబోతున్నట్లు తెలిపారు. ఇరవై ఐదు వందల ఏండ్ల క్రితమే మఠాలను స్థాపించి సనాతన ధర్మ రక్షణ కోసం శంకరాచార్య కృషి చేశారని, ఇది గర్వకారణమని స్వామి ముకుందానందజీ అన్నారు. దేశవ్యాప్తంగా గోధ్వజ స్థాపన యాత్ర కోసం కృషి చేయాలన్నారు. ఇది దేశప్రజలందరి కోరిక అని చెప్పారు. సనాతన ధర్మం కోసం నిరంతరం పాటుపడాలని చెప్పారు. గోవులతో అనేక లాభాలున్నాయని, గోహత్యను నిషేధించాలని, గో పోషణ చేయాలని పేర్కొన్నారు. 

శంకరాచార్య శిష్యులు వికాస్ మాటా డుతూ గోరక్షణ చాలా ప్రాచీనమైనదన్నారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే గోహత్యపై  మంగళ్‌పాండే పోరాడారన్నారు. 1966లో కరపాత్రిజీ మహా రాజ్‌జీ నాయకత్వంలో జరిగిన గోరక్ష ఆందోళనలో వేలాది మంది గోభక్తులు ప్రాణాలర్పించారని చెప్పారు. సమావేశంలో సమన్వయకర్తలు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కే శివకుమార్, ఎన్ కే చతుర్వేది, అశోక్, చతుర్వేది, వీవీవీఎస్‌ఎన్‌చౌదరి, దర్శనంశర్మ, తులసీ శ్రీనివాస్, బీ రాజు, పుప్పల శ్రీధర్, సురారం శేఖర్‌రెడ్డి, బసవరాజు శ్రీనివాస్, సుధాకరశర్మ, వినయ్‌శర్మ, బాలరాజుగుప్త తదితరులు పాల్గొన్నారు. 


గోవధ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి: సీఎల్ రాజం

అక్టోబర్ 9న తెలంగాణలో జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్‌జీ ఆధ్వర్యంలో యాత్ర జరుగబోతోందని, అదే రోజు మధ్యాహ్నం 12గంటలకు నగరంలోని రవీంద్రభారతిలో గోమహాసభ జరుగుతుందని సీఎల్ రాజం తెలిపారు. గోమాతను రాష్ట్ర మాతగా ప్రభుత్వాలు ప్రకటించాలని కోరారు. గోబంధువులు, హిందూ బంధువులు యాత్రకు తరలిరావాలన్నారు.  తెలంగాణలో శంకరాచార్య పాదం మోపడంవల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందని, ప్రజలందరికీ మంచి చేసే పనుల్లో భాగస్వామ్యం అవుతామని చెప్పారు. గోవధ నిషేధం చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా గోధ్వజ స్థాపన యాత్ర జరుగుతోందని స్పష్టం చేశారు.