calender_icon.png 23 January, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమోషన్లలో గోల్‌మాల్!

03-12-2024 12:10:36 AM

  1. వాణిజ్య పన్నుల శాఖ పదోన్నతుల్లో అవకతవకలు
  2. ఏసీబీ కేసులు, అవినీతి ఆరోపణలున్నవారికి అందలం?  
  3. హెడ్డాఫీస్ కేంద్రంగా ఓ సీనియర్ ఉద్యోగి చేతివాటం 
  4. కొనసాగుతున్న ఏసీటీవోల ప్రమోషన్స్ ప్రక్రియ

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): వాణిజ్య పన్నుల శాఖలో జరుగు తున్న ప్రమోషన్లలో గోల్‌మాల్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులకు అనర్హులైన వారిపేర్లను ప్రమోషన్ల జాబితాలో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

ప్రమోషన్ల మాటున భారీ ఎత్తున సొమ్ము చేతులు మారుతున్నట్టు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం భర్తీ చేసిన గ్రూప్ ఉద్యోగుల్లో 624 మంది జూనియర్ అసిస్టెంట్లను ప్రభుత్వం కమర్షియల్ ట్యాక్స్ శాఖకు కేటాయించింది. వీరికి డిసెంబర్ 4న పెద్దపల్లిలో నిర్వహిస్తున్న సభలో సీఎం రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందజేయనున్నారు.

అయితే, వాణిజ్య పన్నుల శాఖకు కొత్తగా వస్తున్న 624 మందికి పోస్టింగ్ ఇవ్వాలంటే వివిధ క్యాటగిరీల్లో కొందరికి ప్రమోషన్లు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు శాఖ లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్స్ స్థాయి నుంచి సీటీవో వరకు ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇటీవలే డీసీటీవో ప్రమోషన్ల ప్రక్రియను ముగించిన యంత్రాంగం.. ఇప్పుడు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో) పదోన్న తులపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రమోషన్లలో భారీ ఎత్తున అవకవతకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అర్థ రాత్రుల్లో బేరసారాలు? 

సదరు సీనియర్ ఉద్యోగి హెడ్డాఫీస్‌లో వన్ మ్యాన్ షో మాదిరిగా వ్యవహరిస్తున్నట్టు సాటి ఉద్యోగులు చర్చించుకుం టున్నారు. ప్రమోషన్ కోసం దరఖాస్తు చేసుకునే ఉద్యోగి తన ఆప్షన్ ఫారమ్‌ను హెడ్డాఫీస్‌కు పంపాల్సి ఉంటుంది. అందు లో తనపై ఉన్న కేసులను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది.

రాష్ట్రంలోని అన్ని డివిజన్లలో అడ్డదారిలో ప్రమోషన్లు పొందాలనుకునే వారికి ఆ ప్రొఫైల్‌ను ఎలా తయారు చేయాలో ఆ సీనియర్ అధికారే డిక్టెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొందరికి ఆ ఆప్షన్ లేకుండానే ప్రమోషన్స్ ఇప్పిస్తానని చెప్పి బేరసారాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

కమిషనర్, స్పెషల్ కమిష నర్, ఇతర ఉద్యోగులు అందరూ ఆఫీసు నుంచి వెళ్లిపోయాక.. రాత్రి 11, 12 గంటల వరకు ఆఫీస్‌లోనే ఉండీ సదరు ఉద్యోగి ఈ బేరసారాలు నడిపించినట్టు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ప్రమోషన్లలో కూడా భారీ ఎత్తున నగదు చేతులు మారినట్టు ఉద్యోగులు చర్చించుకోవడం గమనార్హం. 

అసలైన అర్హుల ఆవేదన 

వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీనే కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే, టీజీఐఐసీలో ఎగ్జిక్యూ టీవ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న నిఖిల్ చక్రవర్తి స్పెషల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో పూరిస్థాయి కమిషనర్ లేకపోవడంతో, అదనపు బాధ్యతల వల్ల ఈ ఇద్దరు అధికారులు కూడా పూర్తిస్థాయిలో హెడ్డాఫీసుపై దృష్టి సారించలేకపోతున్నట్టు తెలుస్తోంది.

ఇదే అదునుగా హెడ్డాఫీసులోని కొందరు అధికారులు, ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అందులో ఈ సీనియర్ ఉద్యోగి కూడా ఉన్నారు. సీనియర్ ఉద్యోగి చేతివాటాన్ని ప్రదర్శిస్తూ.. అనర్హులకు, అవినీతి ఆరోపణలు ఉన్న వారికి  ప్రమోషన్లు ఇప్పించే ప్రయత్నం చేస్తుండం వల్ల.. తమకు అన్యాయం జరుగుతోందని అసలైన అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చక్రం తిప్పుతున్న ‘సీనియర్’ ఉద్యోగి

ఏసీటీవో పదోన్నతుల విషయంలో కనీసం సర్వీస్ రూల్స్ పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున అవకతవకలు జరగడం వెనుక హెడ్డాఫీస్‌లోని సెక్షన్‌లో పనిచేస్తున్న ‘సీనియర్ ఉద్యోగితోపాటు మరికొందరి హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సీనియర్ ఉద్యోగి గత 20 ఏళ్లుగా అక్కడే తిష్టవేసి సెక్షన్లు మారుతున్నారు కానీ, హెడ్డాఫీసును మాత్రం వీడట్లేదని విమర్శలు ఉన్నాయి.

ఏసీబీ కేసులు, ఇతర అవినీతి ఆరోపణలు ఉన్నవారికి, ప్రభుత్వం నిర్దేశించిన క్రైటీరియాలో లేనివారికి కూడా ప్రమోషన్లు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. అవినీతి ఆరోపణల నుంచి క్లీన్‌చీట్ వచ్చిన తర్వాతే వారు ప్రమోషన్లకు అర్హులు అవుతారు. కానీ, నిబంధనలను పక్కన పెట్టి అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా ప్రమోషన్లు ఇప్పించేందుకు సదరు సీనియర్ బేరసారాలు నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇతర సెక్షన్లు, డివిజన్లలో అధికారులు అడ్డుతగలకుండా వాళ్లతో నేరుగా మాట్లాడుతున్నారట. ఇవన్నీ మ్యానేజ్ చేయడం కోసం అవినీతి ఆరోపణలు ఉన్న సదరు కొందరు ఉద్యోగులు ఆ సీనియర్ ఉద్యోగికి భారీ ఎత్తున సొమ్మును ముట్టజెప్పుతున్నట్టు సమాచారం.