- కాంట్రాక్టర్ అత్యుత్సాహంతో ఇష్టరాజ్యంగా టెండర్ దాఖలు
అధిక లెస్ కోడ్ చేయడంతో పలు అనుమానాలు?
బాసర, జనవరి 24: దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సర ఆలయంలో ఏటా దేవి శరన్నవరాత్రి, శివరాత్రి, వసంత పంచమి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు అమ్మవారి జన్మదినం సందర్భంగా (వసంత పంచమి) వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా భక్తుల కోసం తాత్కాలిక క్యూ లైన్ ఏర్పాటు, విద్యుత్ దీపాల అలంకరణ కోసం ఆన్‌లైన్ ద్వారా టెండర్లు పిలిచారు.
అందులో ఓ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యాంగ టెండర్ దాఖలు చేసినట్లు సమాచారం. విద్యుత్ దీపాల అలంకరణ కోసం దేవస్థానం అధికారులు రూ.8,13,823 లకు టెండర్ పిలవగా సదరు కాంట్రాక్టర్ 8% లెస్ కోడ్ చేయగా రూ.65,105 తీసివేసి రూ.7,48,717 లకు దక్కించుకున్నాడు. ఇది బాగానే ఉన్నా తాత్కాలిక క్యూ లైన్ కోసం ముగ్గురు కాంట్రాక్టర్లు టెండర్‌లో పాల్గొనగా.. అదే కాంట్రాక్టర్ అత్యుత్సాహం కనబరిచి 40% లెస్ కోడ్ చేసి పని దక్కించుకున్నట్లు సమాచారం.
దేవస్థాన అధికారులు క్యూ లైన్ కోసం రూ.4,82,764 లతో టెండర్ పిలువగా 40% లెస్ అంటే రూ.1,93,105 తీసివేయగా మిగతా రూ.2,89,658 లతో ఏం పని జరుగుతది అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా ప్రభుత్వం అమ్మవారి ఆలయ అభివృద్ధికి (మాస్టర్ ప్లాన్)లో భాగంగా రూ.50 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ పనుల్లో కూడా ఇలాంటి లెస్ కోడ్ చేస్తే నాణ్యత లేకుండా నాసిరకం పనులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు పనితీరుపై దృష్టి కేంద్రీకృతం చేయకుంటే మరింత నష్టం జరిగే అవకాశం ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.