రూ. 7 కోట్ల స్కాంపై కేసు
గత సర్కార్‌లోనూ చంద్రశేఖర్‌పై ఆరోపణలు
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 26: గోల్డ్‌ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. పెట్టుబడుల పేరు తో రూ.7 కోట్ల మేర మోసం చేశాడని ఆరోపి స్తూ విక్రాంత్‌రెడ్డి అనే వ్యక్తి ఎకనామిక్స్ ఎఫైర్స్ వింగ్ (ఈడబ్ల్యూ)కు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కోకాపేటలోని అతడి నివాసంలో అదుపులోకితీసుకున్నారు. చంద్రశేఖర్‌పై ఇప్ప టికే నార్సింగి, గచ్చిబౌలి, రాయదుర్గం పీఎస్‌లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈయనఫోన్ ట్యాపింగ్ కేసులోనూ నిందితుడిగా ఉండటం గమనార్హం.
విల్లాల పేరుతో గాలం
చంద్రశేఖర్ విల్లాల పేరుతో ప్రముఖులకు గాలం వేసి మోసం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈయన కోకాపేటతోపాటు మంచిరేవుల ప్రాంతంలో గోల్డ్‌ఫిష్ అడోబ్ కంపెనీ పేరుతో విల్లాల నిర్మాణం ప్రారంభించి ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్, అతడి మేనేజర్ శ్రీకాంత్, హీరో ప్రభాస్ సోదరుడు సత్యనారాయణరాజు, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సంజయ్ కామ్టాం, హైకోర్టు లాయర్లు.. ఇలా ఎంతోమంది హైప్రొఫైల్ వర్గాలకు చెందిన వారికి విక్రయించాడు. విల్లాలకు మొదట ఒక రేటు చెప్పి, తర్వాత అదనంగా డబ్బు వసూలు చేసేవాడన్న ఆరోపణలు ఉన్నాయి.
సొమ్ము చెల్లించిన వారికి సైతం విల్లాలు అప్పగించలేదని కొందరు అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు గతంలో చంద్రశేఖర్‌పై మూడుసార్లు పీడీ యాక్టులు నమోదు చేశారు. అయితే గత ప్రభుత్వం హయాంలో తన పలుకుబడిని ఉపయోగించి తనపై నమోదైన పీడీ యాక్టులను తొలగించుకున్నాడని సమాచారం. ఆయన్ను బాధితులు బ్లాక్‌మెయిలర్, ఫేక్ షేర్ ట్రాన్స్‌ఫర్ ఫ్రాడ్ అని చెప్తున్నారు.