calender_icon.png 28 September, 2024 | 2:57 AM

రూ.76 వేలకు చేరువైన బంగారం

22-09-2024 12:00:00 AM

హైదరాబాద్‌లో రికార్డు ధర

తులం మరో 820 పెరుగుదల

హైదరాబాద్, సెప్టెంబర్ 21: పండుగ సీజన్లో బంగారం కొనుగోలుదార్లకు షాక్‌నిస్తూ బంగారం ధర దూసుకెళ్తున్నది. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ భారీగా వడ్డీ రేటును తగ్గించడంతో  ప్రపంచ మార్కెట్లో పసిడి కొత్త రికార్డుస్థాయికి పరుగు తీసిన నేపథ్యంలో  దీంతో దేశీయంగా వరుసగా రెండో రోజూ పుత్తడి ధర పెరిగింది. శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం ధర రూ.76,000 స్థాయికి చేరువయ్యింది. జూలై రెండోవారంలో నెలకొల్పిన 75,300 గరిష్ఠధరను అధిగమించి, కొత్త రికార్డును నెలకొల్పింది.

24 క్యారట్ల తులం పసిడి ధర మరో రూ.820 పెరిగి,  రూ. 75,930 వద్ద నిలిచింది. వరుస రెండు రోజుల్లో రూ.1,480 వరకూ పెరిగింది. ఇదేబాటలో 22 క్యారట్ల ఆభరణాల బంగారం ధర రూ.750 పెరిగి రూ.69,600 వద్దకు చేరుకున్నది.. యూఎస్ ఫెడ్ అంచనాల్ని మించి వడ్డీ రేటును అరశాతం తగ్గించడంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడిలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయని  బులియన్ ట్రేడర్లు తెలిపారు. అలాగే దేశంలో పెండ్లిళ్లు, పండుగ సీజన్‌కావడంతో జ్యువెలర్లు వారి పుత్తడి నిల్వల్ని పెంచుకుంటున్నందున డిమాండ్ అధికమై ధర పెరుగుతున్నదన్నారు. 

సుంకం తగ్గింపు ప్రయోజనం ఆవిరి

జూలై నెలలో కేంద్ర బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాల్ని తగ్గించినందున వినియోగదార్లకు ఒనగూడిన ప్రయోజనం  రెండు నెలలు కూడా నిలవలేదు. 6 శాతం మేర సుంకం తగ్గింపుతో జూలై మూడోవారంలో తులం ధర రూ.5,000కుపైగా తగ్గిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ముందు రోజైన జూలై 22 నాడు హైదరాబాద్‌లో రూ.73,800 ధర ఉన్న బంగారం సుంకం తగ్గింపుతో భారీగా దిగివచ్చి కొనుగోలుదార్లకు ఊరట కల్గించింది. తిరిగి ప్రపంచ ట్రెండ్ కారణంగా అప్పటి గరిష్ఠస్థాయిని పసిడి దాటేయడంతో సుంకం తగ్గించినందున ఒనగూడిన ప్రయోజనం కాస్తా ఆవిరైపోయింది.