calender_icon.png 9 October, 2024 | 5:54 PM

కొత్త గరిష్ఠానికి బంగారం

05-10-2024 12:00:00 AM

రూ.77,670కి చేరిన తులం

హైదరాబాద్, అక్టోబర్ 4: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతలు, పండుగ సీజన్‌తో పుత్తడి నిల్వలను పెంచుకోవడానికి జ్యువెలర్స్ జరుపుతున్న కొనుగోళ్లతో బంగారం ధర కొత్త రికార్డుస్థాయికి ఎగిసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర శుక్రవారం మరింత పెరిగి కొత్త రికార్డుస్థాయి రూ.77,670 వద్దకు చేరింది. 

వరుస గురు, శుక్రవారాల్లో ఇది రూ.770 మేర పెరిగింది.  ప్రపంచ మార్కెట్లో  ఔన్సు పసిడి ఫ్యూచర్ ధర 2,680 డాలర్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో 22 క్యారట్ల ఆభరణాల బంగారం ధర  రూ.71,200 వద్దకు చేరుకున్నది. 

ఆభరణాల అమ్మకాల్లో 25 శాతం వృద్ధి

న్యూఢిల్లీ, అక్టోబర్ 4 :  ఈ ఆర్థిక సంవత్సరం జూలై ద్వితీయ త్రైమాసికంలో ఆభరణాల అమ్మకాలు తొలి త్రైమాసికంతో పోలిస్తే జోరుగా పెరిగాయని, కేంద్ర బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడం అమ్మకాల వృద్ధికి దోహదపడిందని టైటాన్ కంపెనీ శుక్రవారం క్వార్టర్లీ బిజినెస్ అప్‌డేట్‌లో  తెలిపింది.

తొలి త్రైమాసికంలో ఆభరణాల అమ్మకాలు అం తంతమాత్రంగానే ఉండగా, క్యూ2లో గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 25 శాతం వృద్ధిచెందాయని టైటాన్ వివరించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్తగా 75 స్టోర్స్‌ను ప్రారంభించామని, వీటితో తమ మొత్తం స్టోర్స్ సంఖ్య 3,171కు చేరినట్లు తెలిపింది.