- ఒకే రోజులో రూ.1,300 పెరుగుదల
- రూ.74,000 దాటిన తులం ధర
- ప్రపంచ మార్కెట్లో కొత్త రికార్డు
- కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతతో పుత్తడి పెట్టుబడులకు డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 13: పండుగ సీజన్లో బంగారం క్రొనుగోలుదార్లకు షాక్‌నిస్తూ బంగారం ధర ఆకాశాన్నంటుతున్నది. ధనిక దేశాల కేంద్ర బ్యాంక్‌లు వడ్డీ రేట్లను తగ్గిస్తున్న ప్రభావంతో పసిడి పరుగులు తీస్తున్నది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర చరిత్రలో తొలిసారిగా 2,600 డాలర్లను దాటడంతో దేశీయంగా కూడా పుత్తడి ధర వువ్వెత్తున ఎగిసింది. శుక్రవారం ఒక్కరోజులోనే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం ధర రూ.1,300 పెరిగి, రూ.74,000 స్థాయిని దాటేసింది. 24 క్యారట్ల తులం పసిడి ధర రూ. 74,450 వద్ద నిలిచింది.
22 క్యారట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.68,250 వద్దకు చేరుకున్నది. ఈ స్థాయికి ధర పెరగడం దాదాపు రెండు నెలల తర్వాత ఇదే ప్రధమం. గురువారం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) వరుసగా రెండోసారి దఫా పావుశాతం మేర వడ్డీ రేట్లను తగ్గించడం, వచ్చేవారం ప్రధమార్థంలో జరిగే యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమీక్షలో వడ్డీ రేట్లను దించుతుందన్న భారీ అంచనాల నడుమ అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం కడపటి సమాచారం అందేసరికి ఔన్సు బంగారం ధర 25 డాలర్ల మేర పెరిగి 2,605 డాలర్ల వద్ద కదులుతున్నది. గురువారం సైతం ఇది 40 డాలర్లు ఎగిసింది.
దీంతో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో (ఎంసీఎక్స్) 10 గ్రాముల పూర్తి స్వచ్ఛత కలిగిన పుత్తడి ఫ్యూచర్ కాంట్రాక్టు ధర రూ.600 వరకూ పెరిగింది. ఎంసీఎక్స్‌లో వరుస రెండు రోజుల్లో రూ.1,400 ర్యాలీ జరిపింది. సెప్టెంబర్ సమావేశంలో రేట్లను తగ్గించనున్నట్లు ఇప్పటికే ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ సూచనాప్రాయంగా చెప్పారు. రేట్ల కోత అంచనాలతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి రికార్డుస్థాయికి చేరిందని బులియన్ ట్రేడర్లు తెలిపారు. అలాగే దేశంలో పెండ్లిళ్లు, పండుగ సీజన్‌కావడంతో బంగారం డిమాండ్ అధికమై ధర పెరుగుతున్నదన్నారు.
సుంకం తగ్గింపు ప్రయోజనం ఆవిరి
జూలై నెలలో కేంద్ర బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాల్ని తగ్గించినందున వినియోగదార్లకు ఒనగూడిన ప్రయోజనం కాస్తా రెండు నెలలు కూడా నిలవలేదు. 6 శాతం మేర సుంకం తగ్గింపుతో జూలై మూడోవారంలో తులం ధర రూ.5,000కుపైగా తగ్గిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ముందు రోజైన జూలై 22 నాడు హైదరాబాద్‌లో రూ.73,800 నుంచి సుంకం తగ్గింపుతో భారీగా దిగివచ్చిన కొనుగోలుదార్లకు ఊరట కల్గించింది. తిరిగి ప్రపంచ ట్రెండ్ కారణంగా అప్పటి గరిష్ఠస్థాయిని పసిడి దాటేయడంతో సుంకం తగ్గించినందున ఒనగూడిన ప్రయోజనం కాస్తా ఆవిరైపోయింది.
ఇదే బాటలో వెండి
రూ.3,500 పెరిగిన కేజీ ధర
బంగారం బాటలోనే మరో విలువైన లోహం వెండి సైతం భారీగా పెరిగింది. హైదరాబాద్‌లోశుక్రవారం వెండి కేజీ ధర రూ.3,500 పెరిగి రూ.95,000కు చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 3 శాతంపైగా పెరిగి 31 డాలర్ల స్థాయిని దాటింది.