calender_icon.png 28 September, 2024 | 6:53 AM

బంగారం పరుగు

21-09-2024 12:00:00 AM

  1. రూ.75,000 దాటిన తులం ధర
  2. ప్రపంచ మార్కెట్లో కొత్త రికార్డు
  3. ఫెడ్ వడ్డీ రేట్ల కోతతో పుత్తడి పెట్టుబడులకు డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 20: పండుగ సీజన్లో బంగారం కొనుగోలుదార్లకు షాక్‌నిస్తూ బంగారం ధర ఆకాశాన్నంటుతు న్నది. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ భారీగా వడ్డీ రేటును తగ్గించడంతో  ప్రపంచ మార్కెట్లో పసిడి కొత్త రికార్డుస్థాయికి పరుగు తీసింది.  ఔన్సు బంగారం ధర 25 డాలర్ల మేర పెరిగి  2,630 డాల ర్ల స్థాయిని అందుకున్నది. దీంతో దేశీయంగా కూడా పుత్తడి ధర వువ్వెత్తున ఎగి సింది. శుక్రవారం హైదరాబాద్ బులియ న్ మార్కెట్లో తులం ధర రూ.75,000 పైకి ఎగిసింది.

24 క్యారట్ల తులం పసిడి ధర రూ.660 పెరిగి,  రూ. 75,110 వద్ద నిలిచింది. 22 క్యారట్ల ఆభరణాల బంగారం ధర రూ.600 పెరిగి రూ. 68,850 వద్దకు చేరుకున్నది. ఈ స్థాయికి ధర పెరగడం దాదాపు రెండు నెలల తర్వాత ఇదే ప్రధమం. యూఎస్ ఫెడ్ అంచనాల్ని మించి వడ్డీ రేటును అరశాతం తగ్గించడంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడిలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయని  బులియన్ ట్రేడర్లు తెలిపారు. అలాగే దేశంలో పెండ్లిళ్లు, పండుగ సీజన్‌కావడంతో జ్యువెలర్లు వారి పుత్తడి నిల్వ ల్ని పెంచుకుంటున్నందున డిమాండ్ అధికమై ధర పెరుగుతున్నదన్నారు. 

ఇదే బాటలో వెండి రూ.1,500 పెరిగిన కేజీ ధర

బంగారం బాటలోనే మరో విలువైన లోహం వెండి సైతం భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో శుక్రవారం వెండి కేజీ ధర రూ.1,500 పెరిగి రూ.97,500కు చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 3 శాతంపైగా పెరిగి 32 డాలర్ల స్థాయిని చేరింది.