calender_icon.png 22 October, 2024 | 11:23 PM

బంగారం ధరధగలు

22-10-2024 01:21:50 AM

  1. హైదరాబాద్‌లో రూ.80,000కు చేరువవుతున్న తులం 
  2. ప్రపంచ మార్కెట్లో 2,752డాలర్ల ఆల్‌టైం రికార్డుస్థాయికి ఔన్సు 

హైదరాబాద్, అక్టోబర్ ౨1: పండుగ సీజన్‌లో బంగారం ధర ఏ రోజుకారోజు ఎగిసిపోతున్నది.    ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతలు కొనసాగుతాయన్న అంచనాలతో పాటు, మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతలు, రానున్న యూఎస్ అధ్యక్ష ఎన్నికల పట్ల అనిశ్చితి బంగారాన్ని పరుగులు తీయిస్తున్నాయి. 

తాజాగా అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ, ఇటు దేశీయంగానూ సరికొత్త రికార్డు స్థాయికి పుత్తడి పెరిగింది. సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80,000కు చేరువయ్యింది. తాజాగా మరో రూ. 220 పెరిగి రూ.79,640 వద్ద కొత్త రికార్డును నమోదు చేసింది.

ఇప్పటికే ఢిల్లీ బులియన మార్కెట్లో ఇది రూ.80,000 స్థాయిని దాటేసి రూ.80,650 స్థాయికి ఎగిసింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్స్ ధర  చరిత్రలో తొలిసారిగా సోమవారం మరో 22 డాలర్ల మేర పెరిగి 2,752 డాలర్ల రికార్డు గరిష్ఠానికి చేరింది. దీనితో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో (ఎంసీఎక్స్) 10 గ్రాముల పుత్తడి ధర రూ.600కుపైగా 78,400 స్థాయిని తాకింది. 

ప్రపంచ మార్కెట్లో ఇన్వెస్టర్ల డిమాండ్‌కు తోడు స్థానిక మార్కెట్లో రానున్న ధనతెరాస్, దీపావళి నేపథ్యంలో కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాలు పుత్తడి జొరుకు కారణమని బులియన్ ట్రేడర్లు తెలిపారు. తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారట్ల ఆభరణాల బంగారం తులం ధర మరో  రూ.200 పెరిగి రూ.73,000 వద్దకు చేరుకున్నది.

వెండి కేజీ రూ.1,09,000

బంగారం బాటలోనే వెండి ధర కూడా హైదరాబాద్‌లో కొత్త రికార్డుస్థాయికి పెరిగింది. తాజాగా కేజీ వెండి ధర మరో రూ.2,000 మేర పెరిగి రూ.1,09,000 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 34.20 డాలర్ల వద్దకు చేరింది. పారిశ్రామిక డిమాండ్, బంగారం ర్యాలీ కారణంగా వెండి కూడా పెరుగుతున్నదని కమోడిటీ మార్కెట్ నిపుణులు వివరించారు.