calender_icon.png 13 March, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిలాడి లేడీ..

12-03-2025 11:35:17 PM

వృద్ధురాలి కళ్ళలో కారం చల్లి దోపిడి 

నాలుగు తులాల బంగారు నగలు అపహరణ. 

48 గంటల్లో కేసు చేదించిన పోలీసులు

సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఓ కిలాడి లేడి ఓ అమాయకమైన వృద్ధురాలికి మాయమాటలు చెప్పి కళ్ళలో కారం కొట్టి  వృద్ధురాలు మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు, గుండ్లు అపహరించిన లేడీ కిలాడి ఉదంతము ఇది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని 48 గంటల్లో కిలాడి లేడిని పట్టుకొని వృద్ధురాలు కు సంబంధించిన నాలుగు తులాల బంగా అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన కిలాడి లేడిని స్థానిక పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోనే కేసును చేదించి నిందితురాలు నుంచి సొత్తును రికవరీ చేసి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. ఈ దొంగతనానికి సంబంధించిన కిలాడి లేడి వివరాలను  ఎల్లారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన కాశవ్వ 70 అనే వృద్ధురాలు ఈనెల 9వ తేదీన ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన వారంతపు సంతకు వచ్చింది. సంతలో కూరగాయలు కొనుక్కొని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి ఆటోలో వెళ్లేందుకు బస్టాండ్ వద్దకు వచ్చింది. ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ చెందిన ఏశవ్వ 35 అనే కిలాడి లేడీ వృద్ధు రాలిని  వెంబడిస్తూ ఆమె వెనకాలే బస్టాండ్ కు చేరుకుంది. వృద్ధురాలు కాశవ్వతో కిలాడి లేడీ ఏశవ్వ  మాటలు కలిపింది.

దేవునిపల్లి గ్రామానికి వెళ్లాలంటే అంబేద్కర్ చౌరస్తా దగ్గర చాలా ఆటోలు ఉంటాయని తాను కూడా అటే వెళ్తున్నాను అని నమ్మబలికింది. ఏశవ్వను నమ్మిన వృద్ధురాలు కాశవ్వ ఆమెను వెంబడిస్తూ అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకుంది. అక్కడే ఉన్న సి ఎస్ ఐ చర్చ్ వెనకాల నుండి వెళితే దేవునిపల్లి దగ్గర అవుతుందని ఆటో ఎక్కాల్సిన అవసరం లేదని వృద్ధురాలికి నచ్చ చెప్పింది. ఆమె మాటలు నమ్మిన వృద్ధురాలు కాశవ్వ ఆమె వెంట నడుస్తూ చర్చి వెనకాలకు  చేరుకున్నారు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కారంపొడిని ఏశవ్వ వృద్ధురాలు కాశవ్వ కళ్ళలో చల్లింది. అకస్మాత్తు పరిణామానికి లోనైనా కాశవ్వ తేరుకునే లోపే ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడు, తులం నర బంగారు గుండ్లను తెంపుకొని పారిపోయింది. తేరుకున్న వృద్ధురాలు అరవడంతో స్థానికులు గమనించి ఆమెని ఇంటికి చేర్చారు. కుటుంబీకులు సోమవారం ఎల్లారెడ్డి పట్టణ  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి 48 గంటల్లో నిందితురాలు ఏశవ్వను స్థానిక మార్కెట్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు ఏశవ్వ ను విచారణ జరుపగా బంగారు పుస్తెలతాడు సంగారెడ్డి జిల్లా శంకరంపేట లో కుదువ పెట్టిందని, ముందస్తుగా 10 వేల రూపాయలు తీసుకుందని సిఐ వివరించారు. నిందితురాలు ఏశవ్వ ను విలేకర్ల సమావేశంలో ప్రవేశపెట్టి, ఆమె దొంగిలించిన బంగారు పుస్తెలతాడు, 10 వేలరూపాయలను పోలీసులు ప్రదర్శించారు. దొంగతనానికి పాల్పడిన నిందితురాలు ఏశవ్వను స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీంద్ర నాయక్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యాపార సముదాయాల్లో గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా సిఐ రవీంద్రనాయక్ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్సై బొజ్జ మహేష్, ఏఎస్ఐ గంగారెడ్డి, పోలీస్ సిబ్బంది అనిల్ గౌడ్, అర్చన పాల్గొన్నారు.