calender_icon.png 31 October, 2024 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం ఆభరణాలా! వజ్రాల నగలా!?

27-10-2024 12:00:00 AM

ఈ దీపావళికి ఎందులో మదుపు ఉత్తమం?

బంగారంతో భారతీయులకు విడదీయరాని సంబంధం. ధరించడానికి కావచ్చు. సురక్షిత మదుపు సాధనంగా భావించడం కావచ్చు. ప్రత్యేకించి ధనతెరాస్, దీపావళి సమయాల్లో బంగారం ఆభరణాలు, బంగారం నాణేలు, బంగారం బార్స్ వంటివి కొనాలని పలువురు చూస్తుంటారు. ధరలు కొండెక్కిన ప్రస్తుత తరుణంలో రవ్వంతైనా బంగారాన్ని సొంతం చేసుకొవాలని ఆశపడుతుంటారు.

కొన్ని సందర్భాల్లో వజ్రాలు,ముత్యాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాల కోసం అన్వేషిస్తుంటారు. అయితే ఈ దీపావళికి ధర ఎక్కువైనా ఎటువంటి రాళ్లు పొదగని బంగారం నగలు కొనాలా? లేక వజ్రాలు, ముత్యాల్ని అమర్చిన ఆభరణాలు కొనాలా? పెట్టుబడి కోసం ఏది బెస్ట్ అనే సందేహాలకు నిపుణుల సూచనలివే...

హాల్‌మార్క్

ఈ దీపావళికి వజ్రాభరణాల బదులు బంగారం ఆభరణాలు, నాణేలు, బార్లు కొనడం ఉత్తమమని ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా సూచిస్తున్నారు. ఎందుకంటే బంగారాన్ని బ్యూరో ఆఫ్ 

ఇండియన్‌స్టాండర్డ్స్ (బీఐఎస్) హాల్‌మార్క్ చేస్తుందని, దీంతో దాని స్వచ్ఛతకు గ్యారంటీ ఉంటుందని, వజ్రాల స్వచ్ఛతను  సర్టిఫై చేసే బీఐఎస్ తరహా ప్రభుత్వ ఏజెన్సీ ఏదీ లేదని తెలిపారు. అంతేకాకుండా బంగారాన్ని ఆస్తిగా ప్రభుత్వం వర్గీకరించిందని, వజ్రం ఒక వినిమయ వస్తువుగానే ఉన్నదని, వజ్రాభరాణలకు పలు సంస్థలు బైబ్యాక్ ఆప్షన్లు అందిస్తున్నప్పటికీ, దానిని తిరిగి విక్రయించేటపుడు సరైన విలువను పొందడం కష్ఠసాధ్యమని వివరించారు. 

రెండూ మెరుగే.. కానీ

ఈ దీపావళికి బంగారమైనా, వజ్రాలైనా పెట్టుబడికి మెరుగైనవే. కానీ సరళమైన, లిక్విడిటీ కలిగిన, దీపావళి సంస్కృతికి అనుగుణమైన బంగారమే ఉత్తమమని సేన్‌కో గోల్డ్ అండ్ డైమండ్స్ సీఈఓ సువంకర్ సేన్ సూచించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఫలితంగా బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నామని, దీర్ఘకాలంలో విలువను చేకూరుస్తుందని వివరించారు. కానీ ప్రస్తుతం వజ్రాల ధరలు సాధారణ స్థాయికంటే తక్కువగా ఉన్నందున, పెట్టుబడుల్ని వివిధీకరించుకో వలనుకునేవారికి వజ్రాభరణాల కొనుగోలు మంచి అవకాశమని చెప్పారు.

పుత్తడి ధరలు భారీగా పెరిగిన ప్రస్తుత తరుణంలో పలువురు లైట్‌వెయిట్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీలకు ఇష్టపతున్నారని, పండుగలకు, పెండ్లిళ్లకు బంగారం ఆభరణాల్ని మించింది లేదని, రోజూవారీ ధారణకు, చిన్న చిన్న ఫంక్షన్లకు డైమండ్స్ ఒక మోడ్రన్,  ట్రెండీ లుక్‌ను ఇస్తాయన్నారు. ఒకవైపు స్టుల్‌ను, మరోవైపు దీర్ఘకాలిక విలువను కోరుకునేవారు వజ్రాలకు మొగ్గుచూపవచ్చు.

మెరుగైన రాబడి

పెట్టుబడి కోసమైతే బంగారం నాణేలు, బార్లను కొనడం ఉత్తమమైన మార్గమని పీఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ (పీఎన్‌జీ జ్యువెలర్స్) సీఎఫ్‌వో ఆదిత్యా మొదక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆభరణాల విషయానికొస్తే డైమండ్ జ్యువెలరీ కంటే గోల్డ్ జ్యువెలరీ రాబడులు మెరుగ్గా ఉంటాయన్నారు.

వజ్రాభరణాలు కొంటున్నట్లయితే మీరు దాదాపు 50 శాతం విలువైన రాళ్లలోనూ, 50 శాతం బంగారంలోనూ పెట్టుబడి చేస్తున్నట్లని తెలిపారు. కొద్ది దశాబ్దాలుగా ఒక పెట్టుబడి సాధనంగా బంగారమే మంచి ఫలితాల్ని ఇచ్చిందని చెప్పారు.అయితే బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్న సందర్భంలో వజ్రాభరణాలు మీ పెట్టుబడిని స్థిరీకరిస్తాయని అన్నారు. 

తిరుగులేని ఛాయస్ 

వజ్రాలు వాటి మెరుపులతో మంత్రముగ్ధుల్ని చేసేవైనప్పటికీ, ఏండ్ల తరబడి ప్రజలకు బంగారాన్ని మించిన పెట్టుబడి చాయస్ ఏదీ లేదని ఎంఎంటీసీపీఏఎంపీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ సింగ్ చెప్పారు. వజ్రాలతో పోలిస్తే బంగారంతో పలు ప్రయోజనాలు ఉన్నాయన్నా రు.

బంగారానికి ఎప్పుడైనా నగదుగా మార్చుకునే లిక్విడిటీ అధిక మని, కొనడం, అమ్మడం సులభమని, ఒక ఆస్తిగా గుర్తింపు ఉన్నదని, అనిశ్చిత మార్కెట్లో దీర్ఘకాలంలో స్థిరత్వాన్ని ఇస్తుందని వివరించారు. వజ్రాల విలువలు ట్రెండ్స్‌కు అనుగుణంగా మారుతుంటాయని, వాటి కట్, క్లారిటీ విలువను నిర్దేశిస్తాయని, సరైన విలువను కనుక్కో వడం కష్టమని తెలిపారు.

వజ్రాల తరహాలో బంగారాన్ని సింథటిక్‌గా ఉత్పత్తి చేయలేరన్నారు. మరోవైపు ల్యాబ్‌ల్లో వజ్రాల ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత డైమండ్ మార్కెట్లో ధరలు గణనీయంగా తగ్గాయని, డి మాండ్ బలహీనపడిందని, దీనితో వజ్రాల పెట్టుబడి సవాలుతో కూడుకున్నదని అభిప్రా యపడ్డారు.