19-02-2025 12:26:35 AM
చర్ల, ఫిబ్రవరి 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గత మూడు రోజులుగా వరుస దొంగతనాలు చోటు చేసుకోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. గత ఆదివారం రాత్రి ఏకకాలం రెండు బంగారం షాపులలో దొంగతనాలు జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సత్యనారాయణపురంలో తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకొని చోరీ చేశారు, సత్యనారాయణ పురానికి చెందిన నడింపల్లి రామచంద్ర రాజు ఇంట్లో రెండు బీరువాలు తెరిచి సుమారు రూ.లక్ష నగదు,బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు రామచంద్ర రాజు బంధువు రామరాజు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం మూడు రోజుల క్రితం హైదరాబాదులోని బంధువుల శుభకార్యానికి రామచంద్ర రాజు కుటుంబ సభ్యులు వెళ్లారు. ఇంటి తాళాలు వేసి ఉండటంతో దొంగలు ఆ ఇంటిని టార్గెట్ చేశారు. రామరాజు మంగళవారం ఉదయం ఇల్లు శుభ్రం చేయించాలనీ తలుపులు తీసి లోపలికి వెళ్ళగా రెండు బీరువాలు తెరిచి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ఇంటి యజమాని కి ఫోన్ చేసి బీరువాలో ఏమేమి ఉన్నాయని అడుగగా లక్ష రూపాయల సొమ్ము, బంగారము మరియు వెండి వస్తువులు ఉన్నాయని ఫోన్లో సమాచారం అందించాడు.
కాగా రామచంద్ర రాజేంట్‌లో చోరీ ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియ రాలేదు. మండలం లో దొంగలు సంచరిస్తున్నడు తెలుస్తోంది. దుమ్మగూడెం మండలం లక్ష్మీనగరంలో ఓ బంగా రు దుకాణంలో చోరీ జరిగినట్లు తెలిసింది, దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇల్లు విడిచి ఊరు వెళ్తున్న సమయంలో పోలీస్ వారికి సమాచారం అందించాలని, విలువైన సామాన్లు, వస్తువులు కలిగి ఉన్నవారు వీలైనంతవరకూ సీసీ కెమెరాలు అమర్చుకోవడం మంచిదని, ఊర్లో కొత్తవారు అనుమానితులుగా ఎవరైనా కనిపించినట్లయితే పోలీసువారికి సమాచారం అందించాలని సిఐ రాజువర్మ ఎస్‌ఐ నర్సిరెడ్డి తెలియజేశారు.