- మరో రూ.870 పెరిగిన ధర
- హైదరాబాద్‌లో రూ.79 వేలకు చేరువలో తులం
- న్యూఢిల్లీలో తిరిగి రూ.80,000 పైకి
హైదరాబాద్, నవంబర్ 22: ప్రపంచ ట్రెండ్‌ను అనుసరిస్తూ దేశంలో బంగారం ధర వరుసగా ఐదో రోజూ పెరిగి, రెండు వారాల గరిష్ఠస్థాయికి చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర మళ్లీ రూ.79,000 స్థాయిని సమీపించింది. శుక్రవారం మరో రూ.870 పెరిగి రూ.78,820 వద్ద నిలిచింది.
వరుసగా ఐదు రోజుల్లో ఇది రూ.3,000కుపైగా ఎగిసింది. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర మరో రూ.800 పెరిగి రూ.72,250 వద్ద నిలిచింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో పూర్తి స్వచ్ఛతగల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం ఒక్కరోజులోనే రూ.1,100 ఎగిసి రూ.80 వేల స్థాయిని దాటేసింది.
ప్రపంచ మార్కెట్లో 2,700 డాలర్లకు చేరిక
అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంతో బంగారం ధర భారీగా క్షీణించినప్పటికీ, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రతరంకావడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమీక్షలో మరో పావుశాతం వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పసిడి ధరను పరుగులు తీయిస్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి తెలిపారు.
తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్ ధర 30 డాలర్ల మేర పెరిగి మళ్లీ 2,700 డాలర్లపైకి చేరింది. కడపటి సమాచారం అందేసరికి 2,705 డాలర్ల వద్ద కదులుతున్నది. ఫలితంగా దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల ఫ్యూచర్ ధర రూ.900 మేర పెరిగి రూ.77,600 వద్దకు చేరింది.