11-02-2025 12:41:11 AM
* రూ.88 వేలు దాటేసింది!
* ఒక్కసారే రూ.2 వేలు వృద్ధి
న్యూఢిల్లీ: దేశీయంగా బంగారం ధర భారీగా పెరిగింది. సరికొత్త రికార్డులను నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా రూ.2430 పెరిగి రూ.88,500 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. గత వారం 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.86,070 వద్ద ఉండగా.. ఒక్కసారి రెండువేల రూపాయల మేర పెరగడం గమనార్హం. అంతర్జాతీయ పరిణమాలు, రూపాయి క్షీణత పుత్తడి ధర పెరుగుదలకు కారణమని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.
అంతర్జాతీయ విపణిలోనూ స్పాట్‌గోల్డ్ ఔన్సు 2900 డాలర్ల మార్కు దాటడం గమనార్హం. అమెరికా దిగుమతి చేసుకునే అల్యూమినియం, స్టీల్‌పై 25 శాతం సుంకం విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం పసిడి డిమాండ్ ఒక్కసారి ఊపందుకోవడానికి కారణమైంది. కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఏప్రిల్ నెల డెలివరీ పసిడి కాంట్రాక్ట్ రూ.940 మేర పెరిగి రూ.85,828కి చేరింది. అటు వెండి సైతం కేజీకి వెయ్యి రూపాయలు మేర పెరిగి రూ.97,500కు చేరింది.
పసిడిపైనా ట్రంప్ ఎఫెక్ట్
రోజుకో ప్రకటనతో వాణిజ్య యుద్ధభయా లు రేపుతున్న ట్రంప్.. అటు స్టాక్ మార్కెట్లతో పాటు ఇటు బంగారం ధరలనూ ప్రభావితం చేస్తున్నారు. అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానని ఆయన పేర్కొనడం తాజా భయాలకు కారణమైంది. ఏ దేశంపై ఎప్పటి నుంచి విధిస్తారనే దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ..
మరోసారి వాణిజ్య యుద్ధ భయాలకు కారణమయ్యారు. ఈ క్రమంలో అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా పేరొందిన బంగారం డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. టారిఫ్‌లు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వృద్ధి మందగి స్తుందన్న భయాలు పసిడికి డిమాండ్ పెంచుతున్నాయని అనలిస్టులు చెబుతున్నారు.