calender_icon.png 17 October, 2024 | 7:09 AM

బంగారం మరింత పైకి!

28-09-2024 12:00:00 AM

తులం ధర రూ.77,450

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతలు, పండుగ సీజన్‌తో పుత్తడి నిల్వలను పెంచుకోవడానికి జ్యువెలర్స్ జరుపుతున్న కొనుగోళ్లతో బంగారం ధర పరుగు పెడుతున్నది. ఏ రోజుకారోజు కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర శుక్రవారం మరింత పెరిగి రూ.77,450 వద్దకు చేరింది.   యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వడ్డీ రేట్లను తగ్గించడం, మరింత తగ్గించే అవకాశాల కారణంగా  ప్రపంచ మార్కెట్లో  ఔన్సు పసిడి ఫ్యూచర్ ధర 2,700డాలర్ల కొత్త రికార్డుస్థాయికి చేరింది.

ఈ నేపథ్యంలో  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల తులం పసిడి ధర మరో రూ.430 పెరిగి నూతన గరిష్ఠస్థాయి  రూ. 77,450 వద్ద నిలిచింది. వారం రోజుల్లో ఈ ధర రూ.2,000కుపైగా ఎగిసింది. ఇదేబాటలో 22 క్యారట్ల ఆభరణాల బంగారం ధర రూ.400 పెరిగి రూ.71,000 వద్దకు చేరుకున్నది. 

రికార్డుస్థాయికి వెండి

బంగారం బాటలోనే వెండి ధర సైతం రికార్డుస్థాయికి చేరింది.  హైదరాబాద్‌లో కేజీ వెండి ధర శుక్రవారం రూ. 1,000 పెరిగి రూ.1,02,000 వద్దకు చేరింది. ఈ ఏడాది జూలైలో నెలకొన్న రికార్డుస్థాయిని వెండి తిరిగి అందుకున్నది.