న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే తులం బంగారం ధర రూ.700 తగ్గి రూ.79 వేలకు పడిపోయింది. శుక్రవారం 24 కారెట్ల బంగారం పది గ్రాములు రూ.79,700 గా ఉన్న విషయం తెలిసిందే. మరో వైపు కిలో వెండి రూ.300 వృద్ధితో రూ.90,700కు చేరుకుంది. సోమవారం 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం తులం ధర రూ. 700 తగ్గి రూ.78,600 పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజిలో ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ.247 క్షీణించి రూ.77,070 పలికింది.
కిలో వెండి డెలివరీ ధర రూ.479 తగ్గి రూ.89,700 వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా వెండి, వెండి ఆభరణాల విక్రయంపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసే విషయమై సంబంధిత వాటాదారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ ఇండియా ( బీఎస్‌ఐ)ని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ ఆదేశించారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్డ్ కామెక్స్‌లో ఔన్స్ బంగారం 0.18 శాతం పుంజుకుని 2,659.60 డాలర్లు పలికింది.