calender_icon.png 27 December, 2024 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం @ 75,000

18-07-2024 12:05:00 AM

  • ఒక్క రోజులో రూ.980 పెరిగిన తులం ధర 
  • ప్రపంచ మార్కెట్లో కొత్త రికార్డు

హైదరాబాద్, జూలై 17: రెండు నెలలపాటు స్థిరంగా ఉన్న బంగారం ధరకు హఠాత్తుగా రెక్కలు వచ్చాయి. హైరదాబాద్ మార్కెట్లో బుధవారం ఒక్కరోజులో రూ.980 పెరిగిన తులం ధర రూ.75,000 స్థాయిని అందుకున్నది. మే నెల 20న పూర్తి స్వచ్ఛతకలిగిన బంగారం ధర రూ. 75,160 రికార్డుస్థాయికి చేరిన తర్వాత మళ్లీ రూ. 75,000 స్థాయికి పెరగడం ఇదే ప్రధమం.   22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర మరో రూ. 900 పెరిగి రూ. 68,750 వద్ద నిలిచింది. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ జూలై 30, 31 సమీక్షా సమావేశాల్లోనే వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు ఊపందుకోవడంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి కొత్త రికార్డును సృష్టించింది.

క్రితం రోజు 40 డాలర్లు పెరిగిన  ఔన్సు పుత్తడి ధర బుధవారం మరో 20 డాలర్లు ఎగిసి  2,483 డాలర్ల స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా మేలో నెలకొల్పిన 2,468 రికార్డు ధరను తాజాగా అధిగమించింది. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్ కారణంగా స్థానికంగా ధర పెరుగుతున్నదని బులియన్ వర్తకులు తెలిపారు. అంతర్జాతీయ ట్రెండ్ కారణంగా గురువారం సైతం ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వారు అన్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో (ఎంసీఎక్స్) పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల పుత్తడి ధర రూ.74,700 స్థాయికి చేరింది. ద్రవ్యోల్బణం తమ 2 శాతం లక్ష్యానికి చేరువ అవుతున్నదంటూ యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ జూలై 30,31 సమీక్షలోనే వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. సెప్టెంబర్ సమీక్షలో సైతం మరో రేట్ల కోత ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ఈటీఎఫ్‌ల డిమాండ్

ప్రపంచ మార్కెట్లలో రికార్డు గరిష్ఠస్థాయి సమీపానికి చేరిన దృష్ట్యా ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) డిమాండ్‌తో పాటు స్పెక్యులేటివ్ కొనుగోళ్లతో  దేశీయ మార్కె ట్లో బంగారం పుంజుకుంటున్నదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు. యూఎస్ డాలర్ ఇండెక్స్, ట్రెజరీ ఈల్డ్స్ తగ్గుదల బంగారం ధరకు మద్దతును ఇస్తున్నాయన్నారు. అమెరికా, ఫ్రాన్స్‌ల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితితో బులియన్ మార్కెట్లో కొనుగోళ్లు జరుగుతున్నట్టు జేఎం ఫైనాన్షియల్, బ్లింక్‌ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మీర్ చెప్పారు. 

రూ.లక్ష దాటిన వెండి 

హైదరాబాద్ మార్కెట్లో బంగారం బాటలోనే వెండి ధర సైతం పెరిగింది. కేజీ ధర రూ.1,000 మేర ఎగిసి రూ.1,00,500 వద్ద నిలిచింది. ఈ లోహం ఔన్సు ధర ప్రపంచ మార్కెట్లో 31.5 డాలర్ల వద్దకు చేరింది.