హైదరాబాద్, జూలై 4: కొంతకాలంగా నిశ్చలంగా ఉన్న బంగారం ధర హఠాత్తుగా పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్ కారణంగా స్థానికంగా ధర పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ సౌమిల్ గాంధి చెప్పారు. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం ధర ఒక్కసారిగా రూ.710 పెరిగి రూ. 73,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 67,000 వద్ద నిలిచింది. మే నెల 20న పూర్తి స్వచ్ఛతకలిగిన బంగారం ధర రూ. 75,160 రికార్డుస్థాయికి చేరిన తర్వాత ఇది క్రమేపీ తగ్గి రూ. 71,500 స్థాయికి దిగింది.
గత నాలుగైదు రోజులుగా కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తున్నది. తాజాగా యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు ఏర్పడటంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర 25 డాలర్ల మేర పెరిగి 2,360 డాలర్ల స్థాయికి చేరింది. డాలర్ ఇండెక్స్ పడిపోవడంతో బంగారం ధర 1 శాతంపైగా పెరిగి రెండు వారాల గరిష్ఠానికి చేరిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ అనలిస్ట్ మానవ్ మోది చెప్పారు. సెప్టెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేటు తగ్గించే అవకాశం ఉన్నందున సమీప భవిష్యత్తులో బంగారం మరికొంత పెరగవచ్చని ఏంజిల్ ఒన్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ పరమేశ్ మాల్య అంచనా వేశారు.
వెండిదీ పుత్తడి బాటే..
వెండి ధర సైతం పుత్తడినే అనుసరించింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,500 మేర పెరిగి రూ. 97,500 వద్దకు చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 2 శాతం వరకూ ఎగిసి 30.15 డాలర్ల స్థాయిని అందుకున్నది.