calender_icon.png 23 October, 2024 | 7:53 PM

కన్నుల పండువగా గోల్కొండ బోనాలు

15-07-2024 01:14:49 AM

అలరించిన పోతురాజుల విన్యాసాలు..శివసత్తుల కోలాటాలు 

బోనాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్న మహిళలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): గోల్కొండ ఖిల్కొండ బోనాల పండగ ధూం ధాంగా జరిగింది. జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి కనులపండువగా కొనసాగింది. ఆషాడ మాస బోనాల నేపథ్యంలో రెండో వారం కూడా మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు, డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలతో గోల్కొండ కోట జాతర శోభ సంతరించుకుంది. 

ఈ నెల 7వ తేదీన గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో వేడుకలు ప్రారంభం కాగా.. ఆదివారం కూడా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బోనాలు అంటేనే అమ్మవారికి కోళ్లు, మేకలు బలివ్వడం అనవాయితీ. ఈ క్రమంలో బంధువులను పిలుచుకొని అమ్మవారికి కోళ్లు, మేకలు బలిచ్చి అనంతరం అక్కడే వంటలు చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గోల్కొండ కోట పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పలు ప్రాంతాల్లో ప్రారంభమైన ఆషాడమాస బోనాలతో  గల్లీ గల్లీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబంబించేలా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. భాగ్యనగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 4 వరకు బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి.

విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం

ఆషాడ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు తెలంగాణ భక్తులు బోనాలు, సారె సమర్పించారు. భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఏటా ఆషాడ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బంగారు బోనాన్ని శిరస్సుపై ధరించి జోగిని నిషా క్రాంతి నృత్యం చేశారు. మేళ్ల తాళాలు, కోలాటాల మధ్య అమ్మవారికి భోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి అధికారులు పాల్గొన్నారు.