‘భూకైలాస క్షేత్రం’గా ప్రసిద్ధి చెందిన గోకర్ణ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది బెంగళూరు మహానగరానికి 550 కిలోమీటర్ల దూరంలో, హుబ్లీకి దగ్గరగా ఉంటుంది. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇది యాత్రా స్థలమే కాదు అందమైన సముద్రతీర పట్టణం కూడా.
ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను, ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లినా.. ఈ జర్నీ మధురజ్ఞాపకంగా మిగిలిపోతుంది.
కొంకణ్ తీరంలో చిరుపట్టణం గోకర్ణ.. చారిత్రక, పౌరాణిక చరిత్ర అపూర్వం.. శివుడ్ని మెప్పించి, ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళుతూ.. గోకర్ణ వద్ద రావణుడు ఆగాడట. ఆత్మ లింగాన్ని కింద పెట్టకూడదన్న నిబంధన ఉండటంతో దాన్ని పట్టుకునేందుకు వ్యక్తి కోసం చూస్తుండగా.. బాలుడి రూపంలో గణపతి అక్కడకు చేరుకుంటాడు.
ఆత్మలింగాన్ని పట్టుకునేందుకు అంగీకరించిన బాలు డు, త్వరగా రాకపోతే తాను ఆత్మలింగాన్ని కిందపెడతానని హెచ్చరిస్తాడు. సంధ్యావందనం చేసుకుంటున్న సమయంలోనే మూడంకెలు లెక్కపెడతానని రాకపోతే లింగాన్ని కింద పెడతానని.. చెబుతూ.. దాన్ని కింద పెట్టి అక్కడి నుంచి మాయమవుతాడు.
రావణుడు హుటాహుటిన అక్కడకు వచ్చి విగ్రహాన్ని పైకి తీసేందుకు విఫలయత్నం చేసి ఉసూరుమంటూ వెళ్లిపోతా డు. ఇక్కడి మహాబలేశ్వర ఆలయంలో ఆ శివలింగాన్ని నేటికీ చూడవచ్చు.
గోకర్ణ ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు పర్యాటకంగానూ గుర్తింపు దక్కించుకుంది. పశ్చిమ కనుమలు ఒకవైపు ఎగసిపడే సముద్ర తీరం మరోవైపు అమరిపోయాయి. వెనుకజలాల సమీపంలో విస్తారంగా ఉప్పు కొయ్యలు ఉన్నాయి. ఓం, కుడ్లే, హాఫ్ మూన్, ప్యారడైజ్, గోకర్ణ తీర ప్రాంతాలకు పర్యాటకులు వచ్చి వెళుతుంటారు. వారు రాత్రంతా అక్కడే ఉండేందుకు కొన్ని సంస్థలు ప్యాకేజీ టూర్లను నిర్వహిస్తున్నాయి.
ప్యారడైజ్, హాఫ్ మూన్ బీచ్‌లకు వెళ్లేందుకు పడవలు అందుబాటులో ఉంటాయి. అక్కడ టెంట్లు వేసుకుని, స్వయంగా వంట చేసుకునేందుకు, లేదా అక్కడి రెస్టారెంట్‌లో ముందుగా కావలసిన వంటకాలను ఆర్డర్ ఇచ్చి చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. గోవాతో పోల్చితే.. ఇక్కడ ఖర్చు తక్కువగా ఉండటం, రద్దీ అధికంగా లేకపోవడంతో ఎక్కువమంది ఇటీవల ఇక్కడికి వచ్చేందుకు మొగ్గు చూపిస్తున్నారు.
ఓం బీచ్
అరేబియన్ సముద్ర అందాలతో ఓం బీచ్ అద్భుతంగా ఉంటుంది. ఓం బీచ్ గోకర్ణ సమీపంలో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఈ బీచ్ ప్రాంతం ప్రకృతి రమణీయతతో నిండి ఉంటుంది. ఇక్కడి జలపాతాలను పర్యాటకులు ఎంజాయ్ చేస్తారు.
మహాబలేశ్వర ఆలయం
గోకర్ణలోని మహాబలేశ్వర ఆలయం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఒక పుణ్యక్షేత్రం. దీన్ని ద్రవిడ శిల్పకళతో నిర్మిచారు. భక్తులు ఎప్పటికప్పుడు ఇక్కడ పూజలు చేస్తుంటారు.
ఎలా వెళ్లాలి..
గోకర్ణకు రైల్వేస్టేషన్ లేదు. సమీపంలో అంకోలా రైల్వే స్టేషన్ నుంచి బస్సు లేదా టాక్సీ తీసుకొని చేరుకోవచ్చు. అలాగే హైదరాబాద్, బెంగళూరు, హుబ్లీ, మంగళూరు, మార్గోవా తదితర ప్రాంతాల నుంచి గోకర్ణకు ప్రతిరోజు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు తిరుగుతుంటాయి.