రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేక పోతే వాళ్లు చిక్కుల్లో పడతారు. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉండే వాళ్లు ఏం మాట్లాడుతారోనంటూ మీడియా వాళ్లు గమనిస్తూ ఉంటారు. ఏదయినా పొరబాటుగానో, ఉద్దేశపూర్వకంగానో నోరుజారితే చాలు మీడియా దానికి చిలవలు పలవలు అల్లి వివాదాంశం చేసేస్తుంది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి ( ఎస్) అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి కూడా అలా నోరు జారినందుకు మహిళలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తుంకూర్‌లో ఇటీవల జరిగిన ఓ రోడ్డుషోలో కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీ పథకాల కారణంగా గ్రామీణ ప్రాం తాల్లోని కొంత మంది మహిళలు దారి తప్పుతున్నారంటూ వ్యాఖ్యానించారు.
దీనిపై అధికార కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. కుమారస్వామి మహిళలను అవమా నపరిచారని, వారి పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మైండ్‌సెట్‌కు అద్దం పడుతున్నాయని దుయ్యబట్టింది. కుమారస్వామి వ్యాఖ్యలు మహిళలకు పెద్ద అవమానమని పిసిసి అధ్యక్షుడు కూడా అయిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కూడా అన్నారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలయితే కుమారస్వామి మహిళలపై చేసిన వాఖ్యలకుగాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఎన్నికల వేళ ఇది రాజకీయ రంగు పులుముకోవడా న్ని గ్రహించిన కుమారస్వామి చివరికి మహిళలకు క్షమాపణ చెప్పారు.తన వ్యాఖ్య లు మహిళలను గాయపరిచి ఉంటే గనుక తాను వారికందరికీ క్షమాపణలు చెప్తున్నానని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మహిళలను అవమానించడం తన మాటల ఉద్దేశ ం కాదని కూడా ఆయన వివరణ ఇచ్చారు.ఆ వ్యాఖ్యల్లో తాను మహిళలను తల్లులతో పో ల్చాననని, వారిపట్ల తనకెంత గౌరవం ఉం దో అదే చెబుతుందని కూడా ఆయన అన్నా రు. వాస్తవానికి తాను కాంగ్రెస్ ఇచ్చిన గ్యార ంటీలనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశానని కుమారస్వామి అంటూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను నమ్మి మహిళలు ఆ పార్టీకి ఓటేసి తప్పుదోవలో నడిచారనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు రెండు వేల రూ పాయలు ఇచ్చి, వారి భర్తల జేబుల్లోంచి అయిదారు వేల రూపాయలు లాగేసుకుంటోందనే విషయాన్ని వారికి గుర్తు చేయా లనేదే తన ఉద్దేశమన్నారు.
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల దాకా ఉచిత కరెంటు, ప్రతినెలా రూ.2 వేల పింఛను లాంటి ఆరు గ్యారంటీలను ప్రకటించడంతో రాష్ట్రంలోనిఓటర్లలో సగం దాకా ఉన్న మహిళల్లో ఎక్కువ భాగం ఆ పార్టీకి ఓటేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తాను ఈ వ్యాఖ్యలు చేశానని కుమారస్వామి సంజాయిషీ ఇచ్చుకున్నారు. అంతేకాదు, బీజేపీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సినీ తారలు హేమామాలిని, కంగనా రౌనత్‌లపై కాంగ్రెస్ నేతలు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అంటూ, దానికి మీరేం చెబుతారని శివకుమార్‌ను ప్రశ్నించారు. బీజేపీతో పొత్తులో భాగంగా జేడీ(ఎస్) కోలార్‌లో పోటీ చేస్తోంది.