calender_icon.png 27 September, 2024 | 4:50 AM

ఇటానగర్‌లో గోధ్వజ్‌యాత్ర

27-09-2024 03:12:07 AM

  1. వ్యతిరేకించిన స్థానిక విద్యార్థి సంఘాలు
  2. ఎయిర్‌పోర్టు నుంచే వెనుదిరిగిన జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి
  3. నాగాలాండ్‌లోనూ అదే అనుభవం 
  4. కారణం చెప్పకుండా యాత్రకు అనుమతి రద్దు

ఇటానగర్, సెప్టెంబర్ 26: అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానం ద్ సరస్వతి గోప్రతిష్ఠ జెండాను గురువారం ఆవిష్కరించారు. గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో ఐదో రోజులో భాగంగా ఇటానగర్‌లోని దోనిపోలో విమానాశ్రయానికి స్వామీజీ చేరుకున్నారు. కాగా, శంకరాచార్య స్వామీజీని మొదటినుంచి వ్యతిరేకిస్తున్న అరుణాచల్‌ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏఏపీఎస్‌యూ) నాయకులు నిరసనలు తెలిపారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా స్వామీజీ కార్యక్రమాన్ని స్థానిక అధి కారులు కుదించారు. దీంతో శంకరాచార్య స్వామీజీ తొందరగానే ఇటానగర్ నుంచి బయలుదేరారు. అనంతరం స్వామీజీ యాత్రపై విద్యార్థి నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. ధార్మిక నాయకుడిని వెనక్కిపంపడం దేశానికి ప్రతికూల సందేశాన్ని పంపవచ్చు. కానీ, మేం ఏ మతానికి, సంస్థ కు వ్యతిరేకం కాదు. కానీ గోసంరక్షణ యాత్ర అరుణాచల్‌లోని స్థానిక తెగల మనోభావాలకు విరుద్ధం.

ఇక్కడ ఆవుల బలి ఆచారంగా వస్తోంది. మనిషికి ఆవు జన్మనిస్తే అప్పుడు గోమాతగా మేం భావిస్తాం. మాకు ఆవులు కేవలం జంతువులు మాత్రమే. ఇలాంటి నినాదాలతో ఇక్కడ అమాయక ప్రజలను మోసం చేయొద్దు. మీరు గోవుల గురించి ఎక్కడైనా ప్రవచనం చేయండి. ఇక్కడ మాత్రం కాదు అని పేర్కొన్నారు. 

అన్ని సంస్కృతులను గౌరవిస్తాం

విద్యార్థి సంఘం నిరసనలపై స్పందించి న శంకరాచార్య స్వామీజీ.. అరుణాచల్ సం స్కృతిని, ఇక్కడి ప్రజలను గౌరవిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా దేశంలోని ఏ మూలకు వెళ్లినా మన అభిప్రాయాలను తెలియజేవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులను స్వామీజీ చర్చలకు ఆహ్వానించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో 20 నిమిషాల వీడియోను విడుదల చేశారు. ఈ రోజు అరుణాచల్‌లోనూ గోవులను సంరక్షణపై ప్రతిజ్ఞ ను పునరుద్ఘాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం నాగాలాండ్‌లోనూ స్వామీజీకి ఇదే అనుభవం ఎదురైంది.

దిమాపూర్ ఎయిర్‌పోర్టుకు గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో వెళ్లగా అధికారులు అనుమతించలేదు. శంకరాచార్య స్వామీజీ తన బృందంతో పాటు వీఐపీ లాంజ్‌లో కొంతసేపు గడిపిన తర్వాత తదుపరి గమ్యస్థానానికి తిరిగి వెళ్లవలసి వచ్చింది. సెప్టెం బర్ 28న రాజధాని కోహిమాలో జరగాల్సి న యాత్రకు నాగాలాండ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయితే నాగాలాం డ్‌లో యాత్రకు అనుమతి ఎందుకు రద్దు చేశారో మాత్రం అధికారులు వెల్లడించలేదని సమాచారం.