calender_icon.png 31 October, 2024 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతీ దేవికే శఠగోపం

03-07-2024 04:01:11 AM

  • బాసరలో పెరుగుతున్న సిబ్బంది అక్రమాలు 
  • మొన్న వీఐపీ టికెట్లు, నిన్న పులిహోర ప్రసాదం 
  • గదుల కేటాయింపులో కమీషన్ దందా! 
  • అక్రమాలతో ఆలయ ప్రతిష్టకు భంగం

నిర్మల్, జూలై 2 (విజయక్రాంతి): దక్షణ భారత దేశంలోనే ఏకైక సరస్వతీ నిలయమైన బాసరకు అవినీతి పీడ పట్టింది. ఆలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతూ సరస్వతీ మాతకే శఠగోపం పెడుతున్నారు. శుక్రవారం భక్తులకు అందించే పులిహోర ప్రసాదం ప్యాకెట్ల అక్రమాలు బయటపడి ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురికావడం, నలుగురు తాత్కాలిక ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం రాష్ట్రంలోనే కలకలం సృష్టించింది. రికార్డులో పులిహోర ప్యాకెట్ల సంఖ్యను తక్కువగా చూపి ఎక్కువ ప్యాకెట్లను ప్రసాదం కౌంటర్లకు సరఫరా చేశారు. కొందరు గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ అవినీతీ భాగోతం బయటపడింది.

350 పులిహోర ప్యాకెట్లను ఆటోలో సరఫరా చేస్తున్నట్లు రికార్డుల్లో చూపి 640ప్యాకెట్లను తరలించి, పట్టుబడ్డారు. ప్రపాదం పొందిన వారి టికెట్లను వెంటనే చించి చెత్తబుట్టలో వేయాలి. కానీ చించకుండా దాచిన 30 టికెట్లు దొరకడంతో ప్లాన్ ప్రకారమే సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎన్ని రోజుల నుంచి నడుస్తుందోగానీ ఇప్పుడు బయటపడడం ఆందోళన కలిగించే అంశం. వాస్తవంగా ఆలయంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ సిబ్బంది ఇటువంటి అక్రమాలకు పాల్పడడం అనుమానాలకు తావిస్తున్నది. 

భక్తుల రద్దీ పెరిగితే ఇక దోచుకునుడే..

౧౫ రోజుల క్రితం కొందరు సిబ్బంది వీఐపీ పాసులు ఇచ్చి భక్తుల నుంచి అందినంత దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపి స్తున్నాయి. భక్తుల రద్దీ పెరిగితే ఆలయంలో పనిచేసే సిబ్బంది తమకున్న పలుకుబడితో అక్రమాలకు పాల్పడుతూ తలాకొంత వాటాలు పంచుకొని అమ్మవారి ప్రతిష్టకు మచ్చ తెస్తున్నారు. చీరల వేలం, ఇతర సేవా కార్యక్రమాల్లో కూడా అక్రమాలు జరిగినట్లు విమర్శలొస్తున్నాయి. లడ్డు, అక్షరాభ్యాసం, అభిషేకం టికెట్‌లలో కూడా అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

టికెట్లను తీసుకున్న భక్తులు కౌంటర్ల వద్ద సిబ్బందికి అందిస్తేనే ఆయా సేవలకు అనుమతిస్తారు. సిబ్బంది భక్తులు ఇచ్చిన టికెట్‌లను మరోసారి చెల్లుబాటు కాకుండా చింపివేసి చెత్తబుట్టలో వేయాలి. ఆలయంలో పని చేసే కొందరు టికెట్లను చించకుండా తిరిగి కౌంటర్ల ద్వారా అవే టికెట్లను భక్తులకు అం టగడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది. బాసరకు ఎక్కువ సంఖ్యలో వచ్చే మహారాష్ట్ర భక్తులకు వాటిని ఇస్తున్నట్లు తెలుస్తున్నది. 

ఏళ్ల తరబడి పనిచేయడంతోనే..

ఏళ్ల తరబడి సిబ్బంది ఇక్కడే పని చేయడం వల్ల లొసుగులను గుర్తించి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. భోజనాల విషయంలోనూ తక్కువ మందికే ఉచిత భోజనాలు అందించి ఎక్కువ మందికి పెట్టినట్లు లెక్కల్లో చూపినట్లు ఆరోపణలున్నాయి. సాధారణ భక్తులు ఉచిత భోజనం కోసం క్యూలో నిలబడితే సిబ్బంది తమకు తెలిసిన వారికి లోనికి ప్రవేశం కల్పించి భోజనాలు పెట్టిస్తున్నారు. క్యూలో వేచి చూసిన భక్తుల వంతు వచ్చేసరికి భోజనం దొరకడం లేదు. గదుల కేటాయింపులో కూడా అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని పలు వురు భక్తులు బహిరంగానే ఆరోపిస్తున్నారు. 

హెచ్చరించినా ఆగని దందా

బాసర ఆలయంలో అక్రమాలు కొత్తేమీ కాదు. ఏటా ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా అధికారులు విచారణ చేసి హెచ్చరికలు, నోటీసులు జారీ చేయడం తప్ప కఠిన చర్యలు తీసుకోకపోవడం కూడా కారణంగా తెలుస్తున్నది. మార్చి 31న లడ్డు, పులిహోర రికార్డులను విజిలెన్స్ అధికారి కృష్ణేవేణి తనిఖీ చేయగా నిల్వలు, రికార్డులకు తేడా రావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందిని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించి ఆలయ ఈవోకు చార్జీ మెమో జారీ చేసి వదిలేశారు. టెండర్ విషయంలో నిబంధనలను అతిక్రమించినట్టు తెలిసి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. మూడు నెలలు గడిచినా ఇంత వరకు సదరు అధికారులపై చర్య లు తీసుకోలేదు. దీంతో పెద్దల అండతోనే ఇ దంతా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందే

అమ్మవారి ఆలయంలో భక్తులకు పారదర్శకమైన సేవలు అందించాల్సిన అధికారులు, సిబ్బంది అవినితీలో కూ రుకుపోవడం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నది. ఏటా అక్రమాలు జరిగి, ఆలయ ఆదాయానికి గండి కొడుతూ సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తున్నది. ఆలయ ఆదాయ వనరులను కొల్లగొడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. బాసర ఈవో, సిబ్బందిపై ప్రభు త్వం దృష్టి పెట్టాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఆలయ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.