calender_icon.png 21 October, 2024 | 6:52 AM

కండ్లు తెరిచిన న్యాయదేవత

18-10-2024 01:38:39 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: మన దేశంలో న్యాయ దేవత అంటే కుడిచేతిలో తరాజును పట్టుకొని, ఎడమచేతిలో ఖడ్గంతో కండ్లకు గంతలతో కనిపించే విగ్రహమే గుర్తుకొస్తుంది. బ్రిటిష్ వలస పాలనాకాలం నుంచి ఈ విగ్రహాన్నే న్యాయ దేవత ప్రతిరూపంగా వాడుతున్నారు. కానీ, తాజాగా సుప్రీంకోర్టు న్యాయ దేవత కండ్లకు ఉన్న గంతలను తొలగించింది. ఎడమ చేతిలో ఉండే కత్తిని తీసేసి భారత రాజ్యాంగ ప్రతిని అందించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచనలకు అనుగుణంగా భారతీయత సంతరించుకొన్న న్యాయ దేవత విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహాన్ని సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలో చంద్రచూడ్ ఆవిష్కరించారు. ఇప్పటివరకు న్యాయదేవత పాశ్చాత్య వస్త్రధారణలో కనిపించగా, కొత్త విగ్రహం భారతీయతకు గుర్తు అయిన చీరలో కనిపిస్తున్నది. భారతీయ న్యాయ వ్యవస్థ పరిణామానికి ఈ విగ్రహం చిహ్నంగా ఉంటుందని చంద్రచూడ్ పేర్కొన్నారు.