calender_icon.png 8 October, 2024 | 8:29 AM

మళ్లీ గోదావరి గుబులు

11-09-2024 02:15:38 AM

  1. రెండు రోజుల్లోనే పెరిగిన నీటిమట్టం
  2. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చి పరివాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 4౯.2 అడుగలకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రెండు రోజుల్లోనే వరద ప్రవాహం రెట్టింపుగా పెరిగింది. ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటలకు 25.3 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం, 10వ తేదీ సాయంత్రం 7 గంటలకు 48.8 అడుగులకు చేరింది.

ఎగువన ఉన్న మహారాష్ట్ర, చతీష్‌గఢ్ రాష్ట్రాల్లో వర్షాల కారణంగా ప్రాణహిత, చేవెళ్ల, తాలిపేరు ప్రాజెక్టులు నిండి గేట్లు తెరవడంతో వరద నీరంతా గోదావరిలో కలుస్తున్నది. దీంతో భద్రాచలం వద్ద  గోదావరి నీటిమట్టం ఘననీయంగా పెరుగుతోంది. గోదావరి వరద పెరగడంతో భద్రాచలం ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో రహదారులపైకి గోదావరి బ్యాక్ వాటర్ ప్రవహించి రవాణా సౌకర్యం స్తంభించింది. తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం ఉదయానికి 53 అడుగులకు చేరుకొని మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. 

ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

ఖమ్మం, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ నుంచి భద్రాద్రి కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.