calender_icon.png 2 November, 2024 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవం మానవ రూపంలో!

01-11-2024 11:42:51 PM

దేవుడు ఎక్కడో కాదు, మనుషుల్లోనే కొలువై ఉంటాడన్నది అనేకమందికి ఎన్నో సందర్భాల్లో రుజువైన సత్యం. మరీ ముఖ్యంగా తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి మహత్తు విషయంలో ప్రజల అనుభవాలు కోకొల్లలుగా ఉంటాయి. అలాంటిదే నాకూ ఒక ఆశ్చర్యకరమైన ఘటన ఎదురైంది.

అది వేసవి కాలం. ఎండలు మండుతున్నవి. మా చిన్న కుమారుడి పెద్ద కూతురికి పుట్టు వెంట్రుకలు తీయిద్దామని తిరుపతికి బయలుదేరాం. రిజర్వేషన్ సౌకర్యం ఉండడం వల్ల రైళ్లో చక్కగా ప్రయాణం చేసి తిరుపతి చేరుకున్నాం. మాది ఎనిమిది మందితో కూడిన గ్రూప్. అందరం దిగువ తిరుపతికి చేరుకున్న తర్వాత తిరుమలకు యుక్తవయసులోని వారంతా కాలినడకన బయల్దేరారు. నేను, నా ధర్మపత్ని (ప్రమీల), మా అక్క (ముగ్గురం) బస్సులో కొండపైకి చేరుకున్నాం. కాలినడకన రావడం వల్ల వారికి దర్శనం సులభంగా లభించింది. కానీ, మా పరిస్థితే ఇబ్బందిలో పడింది. ముగ్గురమూ రూ. 300 టికెట్ లైనులో నిలబడ్డాం. లైన్ పెద్దగా ఉంది. లోపల కంపార్ట్‌మెంట్‌లోను జనం నిండుగా ఉన్నట్లు ఎవరో చెప్పగా విన్నాను. 

దైవ దర్శనం కోసం వచ్చినప్పుడు అంతా దైవమే చూసుకోవాలి కదా! అందుకే, స్వామిమీద భారం వేసి కంపార్ట్‌మెంట్లవైపు నడిచాం. గేటు దగ్గరున్న అతడు మమ్మల్ని చూసి ఆపాడు. “మా మనవరాలు, వాళ్ల తల్లిదండ్రులు కాలినడకన దైవ దర్శనానికి వచ్చారు. మమ్మల్ని లోపలికి పంపు బాబూ, నీకు పుణ్యముంటది” అని ప్రమీల వినయంగా గేటు దగ్గరున్న వ్యక్తిని కోరింది. అతని మనసు కరిగి, మమ్మల్ని లోపలికి పంపించాడు. మేం ‘బతుకు జీవుడా!’ అనుకొని లోపలకు వెళ్లాం. కానీ, అప్పటికే జనంతో ఆ కంపార్ట్‌మెంట్ నిండిపోయి ఉంది. నిలబడడానికి కూడా స్థలం లేదు. ఇక, కూర్చోవడం మాట దేవుడెరుగు. ప్రమీల, మా అక్క ఇద్దరూ ఎంతో కష్టంగా నిలబడ్డారు. 

ఆ కంపార్టుమెంట్‌లో ఉన్నవాళ్ల చేతుల్లో టికెట్లు ఉన్నాయి. పాసులు కూడా కనిపించాయి. కానీ, మా దగ్గర అవేమీ లేవు. మేం నేరుగా 10వ కంపార్టుమెంటులోకి ప్రవేశించాం. అదృష్టవశాత్తు మమ్మల్ని ఎవరూ ఏమీ అడగలేదు. ప్రవేశించనైతే ప్రవేశించాం గాని, నిలబడడానికి చోటు లేదు. కంపార్ట్‌మెంట్ నుంచి కంపార్టుమెంటులోకి మారేటప్పుడు గేటు ‘ఇట్లా తీసారో లేదో’ జనం ఒకరి మీద ఒకరు పడిపోయారు. కొందరు ఊపిరాడక నిశ్చేష్టులయ్యారు. నాలో ఆందోళన పెరిగింది. కూర్చోలేం, నిలబడలేం. కనీసం పక్కకు కదలలేం. ముందుకు నడవడమైతే అసాధ్యం. బయటకు వెళ్లే అవకాశమూ లేదు. ‘బాబోయ్! రాకుంటే బాగుండేదా?’ అనిపించింది క్షణం పాటు.

ప్రమీలకు చాలా ఇబ్బందిగా ఉంది. చాలాసేపు నిలబడడంతో కదలలేక పోతున్నది. జనం కదలనిస్తే కదా! గేటు తెరిచీ తెరవక ముందే వెనుకున్న వాళ్లు ముందున్న వాళ్లను నెట్టేస్తూ గేటుదాకా రావడానికి ప్రయత్నిస్తున్నారు. నేనెట్లాగో కదిలినా ప్రమీలకు, మా అక్కకూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. మా దీన దుస్థితి వెంకన్నకు తెలిసిందో ఏమో! ఇంతలో ఒక విచిత్రం జరిగింది. 

ఆ ఇద్దరు యువకుల పుణ్యం

ఇద్దరు యువకులు మా దగ్గరికి వచ్చారు. 

“సార్! మీరేమి భయపడకండి. మేడం గారికి మేం రక్షణగా ఉంటాం. మీకు దర్శనం సులభంగా జరుగుతుంది” అన్నాడొక కుర్రాడు. 

నేను ఆశ్చర్యంగా వారికేసి చూశాను. 

“సార్! మీరు ఆచార్యులు కదా! మిమ్మల్ని టీవీలో చూశాం. అందుకే, మిమ్మల్ని గుర్తుపట్టాం. మీరే వచ్చారా? ఇంకా ఎవరైనా ఉన్నారా?” అడిగాడు మరో కుర్రాడు. 

“మా పిల్లలు బహుశా ఇప్పటికే స్వామి దర్శనం చేసుకొని ఉంటారు. మేం ఇలా రావలసి వచ్చింది..” అని వాళ్ల డౌట్ క్లియర్ చేశాను. 

నిజంగానే వారిద్దరూ ప్రమీలకు, అక్కకూ బాడీగార్డ్స్ లాగా ఉండి, జనం మధ్యలో ఏ ప్రమాదమూ జరక్కుండా చూసుకున్నారు. దగ్గరుండి మరీ, స్వామి దర్శనం చేయించారు. జరిగింది ‘కలా, నిజమా’ అని నేను నమ్మలేకపోయాను. 

వారు మా పిల్లలు లోపల ఉండగానే వారితో మమ్మల్ని కలిపారు. మేం మా పిల్లలతో కలిసిన మరుక్షణంలో వాళ్లు మాయమయ్యారు. వారికోసం అక్కడా, ఇక్కడా ఎంత చూసినా కనిపించలేదు. ఇదొక అద్భుత సంఘటనగా నా స్మృతిలో నిలిచిపోయింది.

-ఆచార్య మసన చెన్నప్ప

 సెల్: 9885654381