calender_icon.png 1 October, 2024 | 6:01 AM

మా ప్రాణాలు తీశాకే ప్రజల ఇండ్లపైకి వెళ్లండి

01-10-2024 01:15:21 AM

హైడ్రా దాడులపై బీజేపీ ఒంటరిగానే ఉద్యమిస్తుంది

కుటుంబ, వారసత్వ పార్టీలను బొంద పెట్టండి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  

కరీంనగర్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): అవినీతి, కుటుంబ రాజకీయాలు, వారసత్వం విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు దొందూ దొందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు.

సోమవారం కరీంనగర్‌లో నిర్వహించిన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీ అక్రమాల కూల్చివేత పేరుతో హడావుడి చేసిన బీఆర్‌ఎస్ నేతలు.. పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు హైడ్రా పేరుతో సంపన్నుల నుంచి వసూళ్లు చేసే తంతుకు తెరదీశారని ఆరోపించారు.

హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తమ ప్రాణాలను తీసిన తర్వాత పేదల ఇండ్లపై హైడ్రా దాడులు చేసుకోవాలని అన్నారు. హైడ్రా తీరును దేశవ్యాప్తంగా ప్రజలు అసహ్యించుకుంటు న్నారని అన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే.. మూసీ సుందరీకరణ పేరుతో మరో లక్షన్నర కోట్ల దోపిడీకి కాంగ్రెస్ తెరతీసిందని ధ్వజమెత్తారు.

ఉద్యోగుల జీతాలకే పైసల్లేక అల్లాడుతుంటే మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు సిద్దమయ్యారని, ప్రజల చేతికి చిప్ప చేతికిచ్చి బిచ్చగాళ్లను చేసే పరిస్థితి తీసుకొస్తున్నారని అన్నారు. చెరువులు, కుంటలను ఆక్రమించి సంపన్నులు నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తుందని భావించామని, పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూల్చి వాళ్లకు నిలువ నీడలేకుండా చేస్తోందని మండిపడ్డారు.

అనుమతి లేకుంటే బ్యాంకు లోన్లు ఎలా?

ప్రభుత్వం అన్ని అనుమతిలిచ్చిన తర్వాతే బ్యాంకు లోన్లు తీసుకుని ప్రజలు ఇండ్లు కట్టుకున్నారని, ఇప్పుడు ఆ ఇండ్లను కూల్చి నిలు వ నీడలేకుండా చేస్తే ప్రజలు ఏమైపోవాలని బండి సంజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ పాలన అంటే పేదల గొం తు నొక్కడమేనా?   అని ప్రశ్నించారు.

పేదల ఇండ్లను కూలుస్తానంటే ఒప్పు కోమని, హైడ్రా దాడులను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. కూల్చివేతల విషయంలో పేద ప్రజ లకు అండగా ఉంటామని, ఈ పోరాటంలో బీజేపీ ఒంటరిగానే ఉద్యమిస్తుందని పునరుద్ఘాటించారు. వారం రోజుల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించి అమలు చేస్తామని చెప్పారు.

కాంగ్రెస్ లో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఇలా వారసత్వ రాజకీయాలే నడుస్తు న్నాయని, గాంధీ పేరు పెట్టుకుని ఆయన ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, గాంధీ బతికుంటే వీళ్లను చూసి బాధపడేవారని అన్నారు. కుటుంబ పార్టీలను బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని బండి సంజయ్ కుమార్ కోరారు.