calender_icon.png 16 January, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ గూటికి గూడెం

16-07-2024 12:43:58 AM

కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన పటాన్‌చెరు ఎమ్మెల్యే  

బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి గాలి కూడా..  

కండువా కప్పిన సీఎం రేవంత్

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ నుంచి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్‌కుమార్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరికి రేవంత్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, మహిపాల్‌రెడ్డి పార్టీ మారుతారని వారం రోజుల నుంచే ప్రచా రం జరిగింది. ఈడీ కేసుల నేపథ్యంలో బీజేపీలో చేరుతారని, ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యారని కూడా ఆయన అనుచరులు పేర్కొనడం గమనార్హం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని బీజేపీ షరతు పెట్టడంతో ఆ చేరిక వాయిదా వేసుకున్నారని ప్రచారం జరిగింది.

మూడు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయిన తర్వాత.. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్న మహిపాల్‌రెడ్డి.. సోమవారం కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు. జహీరాబాద్ లోకసభ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్‌కుమార్ ఎన్నికల ముందు కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరి పోటీచేసి ఓట మి చెందారు. తిరిగి ఆయన సొంతగూటికి వచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దా మోదర రాజన రసింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నీలం మధు ముదిరాజ్  ఉన్నారు. 

10కి చేరిన కాంగ్రెస్ చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ౧౦ కి చేరింది. కాగా, ఒకేసారి ఎమ్మెల్యేలను చేర్చుకోకుండా, ఒక్కొక్కరి చొప్పున చేర్చుకుని బీఆర్‌ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్ ఇస్తున్నారు. తాజాగా గూడెం మహిపాల్‌రెడ్డి చేరికతో ఆ సంఖ్య ౧౦కి చేరింది. ఇప్పటివరకు బీఆర్‌ఎస్ నుంచి చేరిన వారిలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, డాక్టర్ సంజయ్‌కుమార్ ఉన్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా సీఎం సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. త్వరలోనే మరికొన్ని చేరికలు ఉంటాయని, అసెంబ్లీ సమావేశాలలోపు బీఆర్‌ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనమమ్యే విధంగా చేరికలు ఉంటాయని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.