calender_icon.png 25 September, 2024 | 11:47 PM

బదిలీపై వెళ్లి.. లీజు ఒప్పందంపై సంతకాలు

25-09-2024 03:25:47 AM

అధికారిపై ఫిర్యాదు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): గతంలో ఘట్‌కేసర్ రైతు సేవా సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేసిన మజ్జిగ కరుణాకర్ అవినీతి, అక్రమాలపై విచారణ చేయాలని కోరుతూ ఘట్‌కేసర్ రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి మేడ్చల్ జిల్లా సహకారశాఖ అధికారికి, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. మజ్జిగ కరుణాకర్ 2024 జూన్ 28న  తన మాతృ సంస్థ అయిన యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు బదిలీపై వెళ్లాడు. అదేరోజు ఘట్‌కేసర్ రైతు సేవా సహకార సంఘం మేనేజింగ్ డైరక్టర్‌గా రాహుల్ రాజ్ బాధ్యతలు తీసుకున్నారు.

అయితే, ఘట్‌కేసర్ ఎఫ్‌ఎస్‌సీఎస్ గోదాములను హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ అనే సంస్థకు 2024 జూలై 1న లీజుకు ఇవ్వగా,  ఆ ఒప్పంద పత్రాలపై బదిలీ అయిన అధికారి సంతకాలు ఉన్నాయి. సదరు సంస్థ నిర్ణీత గడువులోపు లీజు సొమ్ము చెల్లించ నప్పటికీ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికారి లీజు ఒప్పందాలపై సంతకాలు చేశాడు. అతనిపై విచారణ చేసి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు కోరాడు.