calender_icon.png 17 October, 2024 | 6:00 AM

ముందు వెళ్లండి!

17-10-2024 03:28:26 AM

విధుల్లో చేరండి.. తేల్చిచెప్పిన ధర్మాసనం

హైకోర్టులోనూ ఐఏఎస్‌లకు ఎదురుదెబ్బ

  1. స్టే ఇచ్చుకుంటూపోతే ఎప్పటికీ ఈ అంశం తెగదని వ్యాఖ్య
  2. పాలనా నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం
  3. పూర్తి వాదనల తర్వాతే కేటాయింపు ఉత్తర్వులు
  4. క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యానికి ఆస్కారం లేదు
  5. ఐఏఎస్‌ల పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్, అక్టోబర్ 16, విజయక్రాంతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బదిలీ ఉత్తర్వులను సవాలు చేసిన పలువురు ఐఏఎస్ అధికారులకు బుధవారం హైకోర్టులో కూడా ఊరట లభించలేదు. మంగళవారం క్యాట్ స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన ఏడుగురు ఐఏఎస్‌లకు నిరాశే ఎదురైంది.

డీవోపీటీ ఉత్తర్వులను నిలిపివేస్తూ స్టే ఆదేశాల జారీకి హైకోర్టు నిరాకరించింది. కనీసం క్యాట్‌లో కేసు విచారణ జరిగే నవంబర్ 4 వరకు స్టే ఇవ్వాలన్న చిట్టచివరి వినతిని కూడా ధర్మాసనం తోసి పుచ్చింది. లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశామని, దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఉదయం అభ్యర్థించింది మొదలు పిటిషన్ల విచారణ పూర్తయ్యే వరకు ఏ దశలోనూ ఐఏఎస్ అధికారుల తరఫు న్యాయవాదుల వాదనలకు హైకోర్టు సమ్మతించలేదు.

మధ్యాహ్నం వాదనల సమయంలో పిటిషనర్ల న్యాయవాదులు కేంద్రం జారీచేసిన బదిలీ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని పదేపదే కోరగా, స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని అన్ని దశల్లోనూ కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు. చివరికి స్టే మంజూరు చేయాలన్న ఐఏఎస్ అధికారుల మధ్యంతర పిటిషన్లను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

ఈనెల 9న కేంద్రం జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. కేంద్ర ఉత్తర్వుల అమలును నిలుపుదలకు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) నిరాకరించిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయిచినప్పటికీ ఫలితం లేకపోయింది.

తెలంగాణలో పనిచేసే నలుగురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఏపీ ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటి షన్లను బుధవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్‌కుమార్ షావలి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టితో కూడిన ధర్మాసనం విచారించింది.

ఇదీ తీర్పు సారాంశం

కేంద్రం ఈనెల 9న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆలిండియా సర్వీసు అధికారులు వారికి కేటాయించిన రాష్ట్రాల్లో చేయాల్సిందే. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఏమాత్రం ఆస్కారం లేదు. ఆలిండి యా సర్వీసు ఉద్యోగుల కేటాయింపు పరిపాలనాపరమైన నిర్ణయం. ఆ నిర్ణయాల్లో జో క్యం చేసుకోలేం. ఈ మేరకు సుప్రీం కోర్టు సైతం పలు తీర్పులు కూడా వెలువరించింది.

గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తమ వాదనలను కేంద్రం వినకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధ మనే పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యంగా లేదు. అధికారులు వినతులను పరిశీలించిన తర్వాతే కేంద్రం నిర్ణయం తీసుకుంది.  కాబట్టి కేంద్రం జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం. ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నాం.. అని ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

స్టే ఉత్తర్వుల జారీకి నిరాకరణ 

తెలంగాణ, ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను మంగళవారం విచారించిన క్యాట్ సభ్యురాళ్లు లతా బస్వరాజ్ పట్నే, శాలిని మిశ్రాతో కూడిన ధర్మాసనం స్టే ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. దీంతో వారంతా అత్యవసరంగా హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.

లంచ్‌మోషన్ పిటిషన్లను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఉదయం కోర్టు ప్రారంభం కాగానే న్యాయవాదులు ధర్మాసనానికి విజ్ఞప్తి చేసినప్పటి నుంచి పిటిషన్ల విచారణ జరిగే వరకు అన్ని దశలోనూ తాము స్టే ఉత్తర్వులు జారీ చేయబోమని ధర్మాసనం చెబుతూనే వచ్చిం ది. కేంద్రం కేటాయింపు ఉత్తర్వుల మేరకు ఆయా రాష్ట్రాల్లో విధుల్లో చేరాలని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేసిన అంశాలపై విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీచేస్తామని విచారణ సమయం లో పలుసార్లు సూచనలు చేసింది.

స్టేలతో కొన‘సాగు’తారా?

ఎంతకాలం స్టే ఉత్తర్వులతో కొనసాగుతారని, స్టే ఆదేశాలు జారీ చేసుకుంటూపోతే ఎప్పటికీ ఈ వ్యవహారం కొలిక్కిరాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పదేండ్లుగా స్టే ఆదేశాలతో ఏపీకి కేటాయింపు జరిగిన అధికారుల్లో కొందరు తెలంగాణలోనూ, ఇక్కడ కేటాయింపు జరిగితే ఏపీలో కొందరు విధుల్లో ఉన్నారని గుర్తుచేసింది. ఈ విధంగా స్టే ఆదేశాలు జారీచేయబోమని తేల్చిచెప్పింది.

గతంలో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల్లో పిటిషనర్ల వినతులను స్వీకరించి పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని, ఈ విధంగా కేంద్రం చేయలేదని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు కే లక్ష్మీనరసింహ, జీ విద్యాసాగర్, కేఆర్‌కేవీ ప్రసాద్, వీమల్లిక్, వాసిరెడ్డి ప్రభునాథ్ చెప్పారు.

అంతే కాకుండా కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకుని బదిలీలు చేసిందని, కమిటీ నివేదికను కూడా పిటిషనర్లకు ఇవ్వలేదని చెప్పారు. సహజన్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉత్తర్వులు ఉన్నాయన్నారు. ఈరోజే (16వతేదీ) రిలీవ్ కావాల్సివుందని, కేంద్ర ఉత్తర్వులపై తుది తీర్పు వెలువడే వరకు స్టే విధించాలని కోరారు. క్యాట్‌లో దాఖలు చేసిన కేసు విచారణ నవంబర్ 4కు వాయిదా పడిందని, కనీసం వచ్చేనెల 4 వరకు స్టే ఇవ్వాలన్నారు.  

ఆ ఆధికారులతోనే పాలన సాగుతోందా?

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నందున ముందుగా అధికారులు విధు ల్లో చేరాలని హితవు పలికింది.   కేంద్రంలో ఉన్నత స్థాయి అధికారులు ప్రజలకు ఏం కావాలో యోచన చేసి నిర్ణయం తీసుకుంటారంది. స్టే ఇచ్చుకుంటూ పోతే ఈ వివాదానికి ఎప్పటికి తెరపడుతుందని ప్రశ్నించింది.  ఏపీలో ముగ్గురు, తెలంగాణలో నలుగురు అధికారులను కొనసాగించాలని ఆయా రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయనే అంశంపై స్పందిస్తూ, ఏపీ పాలన అంతా ఆ ముగ్గురిపైనే నడుస్తోందా, వారు లేకపోతే ఏపీలో పాలన సాగదా అని ప్రశ్నించింది. 

కేంద్ర ఉత్తర్వులు ఏకపక్షం

 కేంద్ర సర్వీస్ అధికారుల విభజన చేసే ముందు చట్ట ప్రకారం రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరించాలన్న నిబంధనను కేంద్రం అమలు చేయలేదని పిటిషనర్ల న్యాయవాదులు వాదించారు.  కేంద్రం ఏకపక్షంగా అధికారుల విభజన చేసిందన్నారు. వాదనల తర్వాత కల్పించుకున్న హైకోర్టు, మనది వివిధ రాష్ట్రాల సమాఖ్య దేశమని, రాష్ట్రాల వాదనలు వినలేదని పిటిషనర్లు చెబుతున్న దశలో కేంద్రం కొద్దిరోజులు బదిలీలు ఆపి పిటిషనర్ల వినతులను పరిష్కరించిన తర్వాతే తగిన బదిలీ ఉత్తర్వులు చేయవచ్చు కదా.. అని కేంద్రాన్ని ప్రశ్నించింది. రెండు తెలుగు రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరించాలని డీవోపీటీకి ఉత్తర్వులు జారీ చేస్తామంది. 

చెప్పినచోట్ల పనిచేయాల్సిందే: కేంద్రం 

శర్మ తిరిగి వాదిస్తూ.. ఐఏఎస్ అధికారుల బదిలీలపై స్టే ఆదేశాలను జారీ చేయాల్సిన అవసరం లేదని, ఆలిండియా సర్వీసెస్ అధికారులు తాము ఫలానా రాష్ట్రంలోనే పనిచే స్తామంటూ పట్టుబట్టడం సరికాదన్నారు. ఏపీలో వరదలు సంభవించాయని, వాళ్ల సేవలు అక్కడ అవసరమని చెప్పారు. పండుగలు కూడా ఉన్నాయని, ప్రజలకు సేవలు చేయాల్సిన అవసరం వారిపై ఉందని చెప్పారు.

దీనిపై హైకోర్టు, అందరూ తెలంగాణలోనే ఉంటామంటే ఏపీ ప్రజలు, అక్కడి పాలన ఏంకావాలని ప్రశ్నించింది. దీనిపై పిటిషనర్ల న్యాయవాదులు కల్పించుకుని, పాలనాపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదని, ఏపీ నుంచి తెలంగాణ ముగ్గురు, తెలంగాణ నుంచి ఏపీకి నలుగురు ఐఏఎస్ అధికారులు వెళ్లాల్సివుందని, సంఖ్యాపరంగా తేడా ఏమీలేదని చెప్పారు.

15 రోజులు ఆపండి

కోర్టుల్లో కేసులు దాఖలు నేపథ్యం లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ౧౫ రోజులపాటు ఎక్కడి అధికారులను అక్కడే విధుల్లో కొనసాగించేలా అనుమతించాలని, రిలీవ్ చేయరాదం టూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాయని వివరించారు. ఆ లేఖల ప్రతులను ధర్మాసనానికి నివేదించారు. ఈ దశలో హైకోర్టు, ఈ నెలాఖరు వరకు పిటిషనర్లను రిలీవ్ చేయవద్దని డీవోపీటీ, కేంద్ర ప్రభుత్వాలకు ఆదేశిస్తామని చెప్పింది.

ఈ విధంగా చేయాలని టెలిఫోన్ ద్వారా కేంద్రానికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించే అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మకు చెప్పింది. దీనిపై శర్మ స్పందిస్తూ, నెలాఖరుకు విధుల్లో చేరతామని పిటిషనర్లు హామీ (అండర్టేకింగ్) ఇస్తే బదిలీల నిలుపుదలకు సిద్ధమేనని చెప్పారు.

అయినా,  క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం ఏమాత్రం లేదన్నారు. ఈ సమయంలో పిటిషనర్ల న్యాయవాదులు కల్పించుకుని వచ్చే నెల 4వ తేదీకి క్యాట్‌లో కేసు విచారణకు ఉందని, కేంద్ర ఉత్తర్వులపై స్టే జారీ చేయనిపక్షంలో క్యాట్‌లో కేసు తేలేవరకు మధ్యంతర స్టే ఆదేశాలు ఇవ్వాలని, ఇదీ కుదరని పక్షంలో కనీసం వచ్చే నెల 4వ తేదీ వరకు అయినా స్టే ఆదేశాలు జారీచేయాలని కోరారు. 

స్టే తర్వాతా కోర్టుకు వస్తూనే ఉంటారు కదా?

స్టే ఉత్తర్వులు జారీ చేస్తే క్యాట్ తీర్పుకు లోబడి విధుల్లో చేరతారని చెప్పారు. మళ్లీ హైకోర్టు కల్పించుకుని, క్యాట్‌లో బదిలీల పిటిషన్లను డిస్మిస్ చేస్తే హైకోర్టుకు వస్తారని, మెయిన్ కేసును కొట్టేసినా తిరిగి హైకోర్టుకు వస్తారని, గత పదేళ్లుగా ఇదే జరుగుతోందని, ఎంతకాలం స్టే ఆదేశాలతో కొన‘సాగు’తారని ప్రశ్నించింది.

న్యాయవాదులు జవాబు చెబుతూ, తమకు కేసుల మీద కేసులు వేయాలని లేదని, కావాలంటే కేసులను విచారణ చేసి తుది ఉత్తర్వులు జారీ చేస్తే తమకు అభ్యంతరం లేదని, అదేపనిగా కోర్టుల చుట్టూ తిరగాలనే తలంపు పిటిషనర్లకు ఏనాడూ లేదని చెప్పారు. స్టే ఉత్తర్వులు జారీచేస్తూ పోతే ఎప్పటీకి ఈ వ్యవహారం కొలిక్కి రాదని చెప్పింది.

స్టే ఉత్తర్వులను జారీ చేయాలని పిటిషనర్ల న్యాయవాదులు పట్టుబట్టడంతో చివరికి వాదనలు ముగించిన హైకోర్టు న్యాయమూర్తులు, ఉత్తర్వులను రిజర్వు చేసి బెంచ్ దిగి వెళ్లిపోయారు. స్టే ఇవ్వాలన్న మధ్యంతర పిటిషన్లను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించారు. క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఆస్కారమేమీ లేదని వెల్లడించారు.