calender_icon.png 18 October, 2024 | 8:01 PM

జ్ఞానయోగం

18-10-2024 12:00:00 AM

‘భగవద్గీత’లోని చతుర్థాద్యాయం జ్ఞానయోగాన్ని వివరిస్తుంది. జ్ఞానమార్గం ద్వారా ముక్తిని సాధించే మార్గాన్ని ఈ యోగం బోధించింది. ముందుగా పరమాత్మ తాను స్పష్ట్యాదిలో నిష్కామ కర్మయోగాన్ని సూర్యునికి ఉపదేశింపగా, ఆయన తన పుత్రుడైన మనువునకు, అతడు తన పుత్రుడైన ఇక్షా కువుకు ఉపదేశించాడని చెప్పాడు.

అర్జునుడు ఆశ్చర్యపోయి “ఇదేమిటి, నీవు ఇటీవలె జన్మించిన వాడవు, స్పష్ట్యాదిని దీన్ని సూర్యునకు ఉపదేశించానని అంటున్నావు, ఇదెలా సాధ్యం?” అంటే, భగవానుడు “మనిద్దరం అనేక జన్మలెత్తాం. ఆ సంగతి నీకు తెలియదు, నాకు తెలుసు. అయితే, నిజానికి నేను జన్మరహితుడనేనైనా, నా జన్మ ప్రాకృత జన్మకాదు.

నా మాయాశక్తితో శిష్టులను రక్షించి, దుష్టుల ను శిక్షించి ధర్మసంస్థాపన చెయ్యడానికి, ధర్మానికి గ్లాని కలిగినప్పుడల్లా అవతారమెత్తుతూ ఉంటాను” అని తన జన్మ రహస్యాన్ని ముం దుగా చెప్తాడు. ‘తనను భక్తితో సేవించే వారికి సర్వశుభాలు కలుగుతాయని, గుణాలు, కర్మ లు ఆధారంగా వర్ణ విభజన తానే చేశానని’ చెప్పాడు.

మోక్షమే ప్రధాన ధ్యేయంగా..

కర్మ మూడు విధాలని పరమాత్మ చెప్పాడు. అవి: ‘కర్మ’ అంటే శాస్త్ర విహితమైన కర్మ. ‘ఐకర్మ’ అంటే నిషిద్ధకర్మ. అకర్మ అంటే ఏ పనీ చేయకుండా, ఏ ఆలోచనా చెయ్యకుండా ఉండే సోమరిపోతుతనం-  renunciation of action. శ్రీ మధ్వాచార్యులు కూడ ఇలాగే వ్యాఖ్యానించారు. శ్రీ రామానుజులు మాత్రం కర్మ మోక్షసాధనమైందని, వికర్మ అంటే నిత్య నైమిత్తిక కర్మలు వాటి సాధనమైన ద్రవ్య సం పాదన అన్నారు. ఈ కర్మలు అనేక ఫలితాల నిచ్చేవే అయినా, మోక్షమే ప్రధాన ధ్యేయంగా చెయ్యాలని ఆయన వ్యాఖ్యానించారు.

కర్తృత్వ భావం నిస్వార్థంగా, లోక హితార్థం, భగవదర్పితంగా చేసే కర్మ బంధాన్ని కలిగించదు గనుక, అకర్మే అవుతుంది. అంటే, ఆ కర్మ ను ఆచరించే వ్యక్తి కర్మలో అకర్మను చూస్తున్నాడన్న మాట. అతనికి కర్మ బంధం ఉండదు. వాసనలను త్యజించకుండా, మనసును జయించకుండా, ఏ కర్మా చెయ్యకుండా కూర్చునేవాడు అకర్మలో కర్మను చేసేవాడే. అతని మనసు అనేక విషయాలలో సంచరిస్తుంది గనుక అతనికి అకర్మను ఆపాదించలేం. నిష్కామ కర్మ చేసేవాడు, కర్మలను జ్ఞానాగ్నిలో దగ్ధం చేసేవాడు పండితుడు.

ఆశను త్యజించి, ఇంద్రియాలను స్వాధీన పరచుకుని నప్రతి గ్రహీతగా ఉంటూ రాగద్వేషాలు లేనివానికి కర్మబంధం ఉండదు. జ్ఞాన యోగం యజ్ఞాలకు సంబంధించిన అనేక విషయాలను కూడా వివరించింది. ఈ ప్రపంచం లో జ్ఞానం కంటే గొప్పదేది లేదు. “ఆ జ్ఞానం శ్రద్ధ వల్లనే లభిస్తుంది” అని ‘భగవద్గీత’లోని జ్ఞానయోగం బోధిస్తుంది. మొదట చిత్తశుద్ధిని అలవరుచుకోవాలి. తరువాత సాధన చతుష్టయాన్ని అనుష్ఠించాలి.

అప్పుడు సద్గురువు శిక్షణలో శ్రవణ, మనన, నిదిధ్యాసలను అనుసరించి సాధన చేస్తే సమాధి లభిస్తుంది. సమాధిలోనే స్వస్వరూ పజ్ఞానం లభిస్తుంది. ఇదే జ్ఞానమార్గం ద్వారా సద్యోముక్తిని పొంద డం. ముఖ్యమైన విషయం ఏమిటంటే, కర్మయోగం, జ్ఞానయోగం వేరు వేరని అనుకో కూడదు. ఏ ఒక్కటి అనుష్ఠించినా రెండవ దాని ఫలితం కూడ వస్తుంది (భగవద్గీత: 5.4).

‘శ్రీ వేదభారతి’ సౌజన్యంతో, 

‘వేదాంత పరిభాష’ నుంచి..

 కళానిధి సత్యనారాయణ మూర్తి