ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో, సెప్టెంబర్ 14: యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ఒకప్పుడు శివాలయమేనని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పునరుద్ఘాటించారు. గోరఖ్‌పూర్‌లో శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘దురదృష్టవశాత్తూ ప్రజలు జ్ఞానవాపిని మసీదు అనుకొంటున్నారు. కానీ అది విశ్వనాథుడి సొంత మందిరమే. అక్కడికి పూజలు చేయటానికి వెళ్తున్న ప్రజలు ఆ పేరుతోపాటు పూజా కార్యక్రమాలపై ఉన్న ఆంక్షల పట్ల విచారం వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితి దేశ సమగ్రతకు కూడా ఇబ్బందే. ఈ విషయాన్ని గతంలో మన సమాజం అర్థంచేసుకోలేదు. ఇకపై మన దేశం ఎంతమాత్రమూ వలస పాంతంగా ఉండజాలదు’ అని పేర్కొన్నారు.
సుదీర్ఘ వివాదం
జ్ఞానవాపి మసీదు ఒకప్పుడు భారీ శివాలయమని, 17వ శతాబ్దంలో మొఘల్ పాల కుడు ఔరంగజేబ్ ఆదేశాలతో ఆలయాన్ని పడగొట్టి ప్రస్తుతం ఉన్న మసీదు నిర్మించారని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. ఇదే అంశంపై కోర్టులో కేసులూ వేశారు. బాబ్రీ కూల్చివేతకు పూర్వం జ్ఞానవాపి మసీ దు బేస్‌మెంట్‌లో హిందువులు పూజలు నిర్వహించుకొనేవారు. బాబ్రీ అల్లర్లతో హిందువులను అందులోకి అనుమతించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పూజలు నిర్వహించుకొనేందుకు కోర్టు తిరిగి అనుమతి ఇచ్చింది. ఈ మసీదు ఒకప్పుడు హిందూ ఆలయమా? కాదా? అనే అంశాన్ని తేల్చేందుకు సర్వే కూడా నిర్వహిస్తున్నారు.