- ఆచార్య మసన చెన్నప్ప :
- ఎవ్వరి యాశీస్సు వృథగాక ఫలియించు
- నతడు గురుపదవి కర్హుడగును
- ఎవ్వరి యుపదేశ మెడలించు నజ్ఞాన
- మతడు గురుపదవి కర్హుడుగును
- ఎవ్వరి వర్తనమిచ్చును సౌశీల్య
- మతడు గురుపదవి కర్హుడగును
- ఎవ్వరి యక్షర మిచ్చునక్షరధన
- మతడు గురుపదవి కర్హుడగును
- పూజనీయుడౌ ఆనందమూర్తి నేడు
- గురువు స్థానంబులో నిల్చి వరలుచుండ
- మసన చెన్నప్పతోపాటు మహిని గలుగు
- శిష్యుల యదృష్ట మేమని చెప్పగలను!
1990 అక్టోబర్ మాసంలో పదవీ విరమణ చేసిన మా గురువు సన్మానసభలో నేను చదివిన పద్యమిది. ఆయన ఎవరో కాదు, వేటూరి ఆనందమూర్తి. ఆ ఇంటిపేరు చెబితేనే పరిశోధక బ్రహ్మ ‘వేటూరి ప్రభాకరశాస్త్రి’ వెంటనే గుర్తుకు వస్తారు. ప్రభాకరశాస్త్రి శ్రీమతి మహాలక్ష్మమ్మల తనయులే ఆనందమూర్తి. వీరు 1930 అక్టోబర్ 29న మద్రాసులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి 1953లో బి.ఏ. ఆనర్స్ పట్టా పొందిన తర్వాత హైదరాబాద్‌లోని వివేకవర్ధనీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులయ్యారు.
1955లో ఎం.ఏ.లో ఉత్తీర్ణులైన వీరు, కొంత కాలానికే ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఉపన్యాసకులుగా చేరారు. 1990లో శాఖాధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు. ఆనందమూర్తి ‘విజయనగర యుగ పు తెలుగు సాహిత్యంపై వైష్ణవ తత్త ప్రభావం’ అనే అంశం గురించి ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో పరిశోధన చేసి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1966లో పీహెచ్‌డీ డిగ్రీ పొందారు.
ఇక, తండ్రి ప్రభాకరశాస్త్రి ‘తాళ్లపాక సాహిత్యం’ మీద ఎవరూ చేయనంత పరిశోధన చేశారు. తండ్రి మార్గంలో, అదే అభినివేశంతో ఆనందమూర్తి భక్తిమార్గంలో నడిచి, విలువైన పరిశోధనా గ్రంథాన్ని వెలువరించారు. ఆ తండ్రి తర్వాత ఈ కొడుకే ‘తాళ్లపాక కవుల పద సాహిత్యం’పై లోతైన పరిశోధన చేశారు. మొదటిసారిగా శైవ కవుల సాహిత్యంలో వినిపించే సామాన్య ప్రజల గుండె చప్పుళ్లను విన్నది ఆనందమూర్తియే.
పరిశోధనలో వారి వ్యక్తిత్వమే స్పష్టంగా కనిపిస్తుంది. ఆనందమూర్తిది రాగద్వేషాలకు అతీతమైన దృక్పథం. ఏది చెప్పినా సతార్కికంగా, సోదాహరణంగా ఉంటుంది. పరిశోధనల్లో అనుశీలనా సామర్థ్యంతోపాటు సంయమనమూ అవసరమని వారివల్లే తెలుసుకున్నాను.
నేను 1978 మధ్యకాలంలో ఓయూలో ఎంఏలో చేరాను. ఉదయం ఉద్యోగం చేస్తూ సాయంకాలం చదవాలనుకోవడం వల్ల ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ చదివే అవకాశం కలగలేదు. అప్పుడు నిజాం కళాశాలలో సాయంకాలం ఆర్ట్స్, సోషల్ ఫ్యాకల్టీలలో స్నాతకోత్తర తరగతులు రెగ్యులర్‌గా జరుగడం మా అదృష్టం. నాకు ఎంఏలో ఆనందమూర్తి భాషాశాస్త్రం, సాహిత్యం పాఠాలు బోధించారు. వారి పాఠం మా విద్యార్థులకు కర్ణరసాయనంగా ఉండేది. ఆ రోజు చెప్పవలసిన అంశాలేగాక ప్రభావిత అంశాలనూ వారు ముందుగానే ఎన్నుకునేవారు.
అందువల్ల మా గ్రహణశక్తి ద్విగుణీకృతమయ్యేది. నాకు ఎంఏలో విశ్వవిద్యాలయ తెలుగు విభాగంలో ప్రప్రథమ స్థానం లభించింది. అప్పట్లో డిస్టింక్షన్ సాధించింది నేనొక్కణ్ణే. ప్రత్యేకంగా ఆనందమూర్తి నన్ను అభినందించడం నేనెప్పటికీ మరిచిపోలేను. ఆచార్య రవ్వా శ్రీహరికి, ఆచార్య ఆనందమూర్తికి మిక్కిలి మైత్రి. వీరిద్దరూ సౌమ్యులూ, సౌజన్యమూర్తులూ. ఎవరి జోలికీ పోరు.
ఎవరైనా తమ జోలికి వచ్చినా, ‘దుష్టులకు దూరం’ అన్నట్లు మెలిగేవారు. ఆచార్య రవ్వా శ్రీహరి సూచన మేరకు నేను ఆనందమూర్తి పర్యవేక్షణలో ‘వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ సూచిక’ను పరిశోధనాంశంగా గ్రహించాను. ‘పరిశోధక బ్రహ్మ’గా ప్రసిద్ధినొందిన ప్రభాకరశాస్త్రి ముద్రిత, అముద్రిత రచనలన్నీ వారి పుత్రుడైన ఆనందమూర్తి వద్ద ఉండడంతో నా పరిశోధన అచిర కాలంలోనే ఫలవంతమైంది.
అప్పుడు ఆనందమూర్తి విజయనగర్ కాలనీలో ఉండేవారు. నేను వారి దగ్గరకు ఆదివారాల్లో సైకిల్‌మీద వెళ్లేవాణ్ణి. ఆయన తండ్రికి తగ్గ తనయులు. వారసత్వంగా సాహిత్య సంపదను పొందిన మహానుభావులు. పరిశోధకులకు పంటపొలం వారి గ్రంథాలయం. తండ్రి ముద్రిత, అముద్రిత రచనలెన్నో అక్కడ ఉన్నాయి. ‘వేటూరి వాఙ్మయ సూచిక’ను తయారుచేయడానికి ఆ లైబ్రరీ నాకెంతో తోడ్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘వాఙ్మయ సూచిక’లు తయారుచేసే విధానానికి అలా నేనే శ్రీకారం చుట్టాను.
మార్గదర్శకులుగా ఆనందమూర్తి వ్యవహరించడం వల్లే సకాలంలో ఎంఫిల్ పూర్తి చేయగలిగాను. ‘ప్రాచీన కావ్యాలు గ్రామీణ జీవన చిత్రణ’ అంశం మీద ఆనందమూర్తి పర్యవేక్షణలో పీహెచ్‌డీ డిగ్రీ కోసం పరిశోధన మొదలుపెట్టాను. ఆయన సూచనలు పాటించడం వల్ల 1988లో పీహెచ్‌డీ డిగ్రీ తీసుకున్నాను. 1990లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, సికింద్రాబాద్ పీజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరేనాటికి ఆనందమూర్తి అక్కడే ఉన్నారు. నన్నెంతగానో అభినందించారు.
- అవాంఛనీయ
- భావోద్వేగాలకు అతీతుడు
నేను వారితో కలిసి ఉన్నప్పుడు “వీరెవరు?” అని ఎవరైనా అడిగితే, “వీరు మా కుటుంబ సభ్యులు” అని చెప్పేవారు. నాపట్ల ఆనందమూర్తి గురుదేవుల అత్యమిత వాత్సల్యానికి ఇదొక ఉదాహరణ. ఆయనే ‘మణిమంజరి’లో నాచేత రెండు, మూడు వ్యాసాలు రాయించారు. తండ్రి ప్రభాకరశాస్త్రి ‘శతజయంతి’ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నుంచి పెద్దకల్లేపల్లికి ప్రత్యేకంగా కట్టిన బస్సులో నన్నుకూడా తీసుకెళ్లారు. బందరులో నాచేత ఉపన్యాసం ఇప్పించారు. ప్రభాకరశాస్త్రి మాస్టర్ సీవీవీ శిష్యులు. యోగమార్గంలో నడిచి ఎందరికో ఆరోగ్యాన్ని కలిగించారు. తనయులు ఆనందమూర్తి కూడా తండ్రి మార్గంలోనే నడుస్తున్నారు.
సత్వసంపన్నమైన వారసత్వానికి ఆచార్య ఆనందమూర్తి ఒక ఉదాహరణ. తండ్రి సాహిత్యాన్ని ప్రచారం చేయడం అందులో ఒక భాగం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ‘వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ పీఠం’ స్థాపితమై పని చేయడం ఆనందమూర్తి కృషి ఫలితమే. ఆనందమూర్తిలో అపారమైన ప్రతిభా వ్యుత్పత్తులు ఉన్నాయి. అయినా, కొత్తగా రచనల వంక పోక ప్రభాకరుల వాఙ్మయాన్నే లోకానికి అందించడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఇదే నిజమైన వారసత్వం కూడా. భగవద్గీతలో ‘అనుద్వేగకరం వాక్యం’ అన్నట్లు ఆయన ఎన్నడూ మాట్లాడేటప్పుడు ఉద్వేగానికి గురికాలేదు. తండ్రివలె సత్య కథనానికే అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
ఉపనిషత్తులలో చెప్పినట్లు, తండ్రివల్ల కుమారులకు జ్ఞానం, ధనం, కీర్తి (మూడు) అందవలసి ఉంది. ధనం గురించి నాకు తెలియదు కాని జ్ఞానధనం, యశోధనం రెండూ ఆనందమూర్తికి తండ్రివల్ల లభించాయన్నది సత్యం. ఏంఏలో పాఠాలు చెప్పి, ఎంఫిల్, పీహెచ్‌డీలకు పర్యవేక్షణ వహించి, వ్యక్తిత్వ పరంగానేకాక సాహిత్యపరంగానూ నావంటి ఎందరికో ఒక స్థాయిని కల్పించడం వారివల్లే సాధ్యమైంది.
వ్యాసకర్త సెల్: 9885654381