calender_icon.png 25 October, 2024 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గతమెంతో ఘనం

18-07-2024 12:46:33 AM

ఒలింపిక్స్‌లో భారత హాకీ ప్రస్థానం

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ క్రీడలో భారత హాకీ జట్టుది చెరగని ముద్ర. ఇంతింతై వటుడింతై అన్నట్లు 20వ శతాబ్దంలో భారత హాకీ ప్రపంచాన్ని ఏకచత్రాధిపత్యంతో ఏలింది. ఒలింపిక్స్‌లో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఎనిమిది స్వర్ణ పతకాలు నెగ్గిన పురుషుల హాకీ జట్టు విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఇప్పుడంటే దేశం క్రికెట్ మత్తులో జోగుతుంది కానీ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన 

తొలి నాళ్లలో హాకీ క్రీడ ఒక వైభవాన్ని చూసింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన హాకీ క్రీడ మన దేశ జాతీయ క్రీడగా అవతరించింది. 80వ దశకం వచ్చేసరికి హాకీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. అయితే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో అంచనాలకు మించి రాణించిన భారత పురుషుల హాకీ జట్టు నాలుగు పదుల తర్వాత పతకాన్ని సాధించి హాకీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో మన హాకీ జట్టు అద్వితీయ ప్రదర్శనతో పసిడి పతకాన్ని పట్టాలని ఆశిద్దాం..

విజయక్రాంతి, ఖేల్ విభాగం: ఒలింపిక్స్‌లో మన భారత హాకీ జట్టు ఘనమైన రికార్డు కలిగి ఉంది. స్వాతంత్య్రానికి మునుపు బ్రిటీష్ పాలనలో మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన పురుషుల హాకీ జట్టు.. స్వతంత్ర భారతంలో మరో ఐదుసార్లు పసిడి పతకాలను గెలిచి విశ్వవేదికపై దేశ ఖ్యాతిని మూడింతలు ఇనుమడింపజేసింది. 1928 ఆమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొన్న భారత హాకీ జట్టు అద్వితీయ ప్రదర్శనతో స్వర్ణం చేజెక్కించుకుంది. 1928 నుంచి 1956 ఒలింపిక్స్ వరకు భారత హాకీ జట్టు వరుసగా ఆరు స్వర్ణాలు గెలిచి చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఆరు ఒలింపిక్స్‌లో ఆడిన 30 మ్యాచ్‌ల్లో అన్నింటా (30 విజయాలు సాధించిన మన హాకీ జట్టు రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.

1960 రోమ్ ఒలింపిక్స్‌లో ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలవ్వడంతో భారత్ సాధించిన ఆరు వరుస స్వర్ణాలు, 30 వరుస విజయాలకు బ్రేక్ పడినట్లయింది. అయితే 1964 ఒలింపిక్స్‌లో ఏడో స్వర్ణం కైవసం చేసుకున్న భారత హాకీ జట్టు తర్వాతి ఒలింపిక్స్‌లో కాంస్యాలు సాధించి తమ పట్టును నిలుపుకుంది. ఇక 1980 ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చివరిసారి స్వర్ణ పతకం దక్కించుకుంది. ఇక్కడి నుంచి మన హాకీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. అక్కడి నుంచి తిరోగమన దశ పట్టిన భారత పురుషుల హాకీ జట్టు 2008 ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఒలింపిక్స్‌లో హాకీ క్రీడలో భారత్ ఇప్పటివరకు 12 పతకాలు గెలుచుకుంది. ఇందులో 8 స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలు నెగ్గింది.

ఒలింపిక్స్‌లో భారత హాకీ చరిత్ర..

  1. 1928 ఒలింపిక్స్‌లో తొలిసారి బరిలోకి దిగిన భారత హాకీ జట్టు ఫైనల్లో నెదర్లాండ్స్‌ను 3 ఓడించి తొలి స్వర్ణం గెలుచుకుంది.
  2. 1932 ఒలింపిక్స్‌లో హాకీ ఫైనల్లో భారత జట్టు 24 తేడాతో అమెరికాపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఒలింపిక్ చరిత్రలో అతి పెద్ద విజయంగా నిలిచిపోయింది.
  3. 1948 ఒలింపిక్స్‌లో ఇంగ్లండ్‌పై ఫైనల్లో నెగ్గిన భారత్ నాలుగోసారి స్వర్ణం గెలిచింది. స్వతంత్ర భారతంలో పురుషుల హాకీ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది.
  4. 1952 ఒలింపిక్స్ హాకీ ఫైనల్లో భారత్ 6 నెదర్లాండ్స్‌పై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో బల్బీర్ సింగ్ ఐదు గోల్స్ కొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.
  5. 1958 ఒలింపిక్స్ హాకీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 1 ఓడించిన భారత్ వరుసగా ఆరోసారి స్వర్ణం గెలిచి రికార్డులకెక్కింది.

పూర్వవైభవం దిశగా..

1980వ దశకం నుంచి తిరోగమన దిశలో పయనించిన భారత హాకీ జట్టు గత టోక్యో ఒలింపిక్స్  అద్వితీయ ప్రదర్శనతో కాంస్యం గెలిచి హాకీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. అనంతరం 2022 బర్మింగ్ హమ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజతం తో సత్తా చాటిన భారత హాకీ జట్టు గతేడాది ఆసియా గేమ్స్‌లోనూ పసిడి పతకం గెలుచుకుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని పురుషుల హాకీ జట్టు రెండేళ్లుగా నిలకడగా విజయా లు సాధిస్తూ వస్తోంది. ఈసారి కచ్చితంగా స్వర్ణం గెలుస్తామని భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ధీమా వ్యక్తం చేశాడు.