యస్యాజ్ఞయా జగత్ప్రష్టా విరంచిః పాలకో హరిః
సంహర్తా కాలరుద్రాభ్యో నమస్తస్త్మ్ర పినాకినే
“ఎవరి ఆజ్ఞతో బ్రహ్మ ఈ జగత్తును సృష్టిస్తున్నాడో, శ్రీ మహావిష్ణువు పాలిస్తున్నాడో ఆయనే కాలరుద్రుడు. పినాకధారియైన ఆ పరమ శివునికి నమస్కరిస్తున్నాను.”
అష్టాదశ పురాణాలలో పరమశివుని మహిమను గురించి చెప్పినప్పటికీ పరిపూర్తిగా చెప్పని పరిస్థితే ఉంది. కానీ, ‘స్కంద పురాణం’ సదాశివుని మహత్తును ఎంతో విపులంగా వెల్లడిస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే అనేక విశేషాలు తెలుస్తాయి. ‘శివ’ అనే రెండక్షరాల పేరు ఉచ్చరించినంత మాత్రానే స్వర్గం, మోక్షం ప్రాప్తిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
పరమశివుడు దేవతల పాలకుడేకాక శాసకుడు కూడా. సర్వకాల సర్వావస్థలలో శివుని భజన చేసేవారు ధన్యులు. లోక కళ్యాణార్థం విషాన్ని మింగిన మహాదేవుని మహిమ వర్ణింపతరం కాదు. ఎవరినోట పంచాక్షరీ మంత్ర మైన ‘నమఃశివాయ’ వెలువడుతుందో వారు శంకరుని స్వరూపులవుతారు. ఉదయంపూట పరమశివుని దర్శనం మాత్రాననే పాపాలన్నీ తొలగిపోతా యి. ఎవరైతే రెండక్షరాల ‘శివ’నామాన్ని జపిస్తారో వారివల్లే ఈ ప్రపంచం మనుగడ సాగుతుంది. ఎవరైతే శివ మంది రాన్ని శుభ్ర పరుస్తారో నిశ్చయంగా వారు శివ సన్నిధిని పొందగలరు.
సంపూర్ణ విశ్వానికే వారు వందనీయులవుతారు. ఎవరైతే శివునికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారో వారు తండ్రి, తల్లి వంశాలను ఉద్ధరించిన వారవుతారు. హరిహరులకు దీపదానం చేసినవారు తేజఃశ్శాలురవుతారు. ముల్లోకాలలో కూడా మహాదేవుణ్ణి మించిన వారు లేరు. పత్రం, పుష్పం, ఫలం, తోయం, శుద్ధ జలంతో శివపూజ చేసిన యెడల శివునంతటి వారవుతారు. పరమ శివునికి పురాణ పఠనం, కథా శ్రవణం, సంగీతం మొదలైనవి ఇష్టం. కాబట్టి, శివాలయంలో వాటిని నిర్వహించాలి. భగవానుడైన శంకరుడు ఈ చరాచర జగత్తుకు ఆధారమై ఉన్నాడు. కనుక, ప్రపంచమంతా శివ స్వరూపమని తెలుసుకోవాలి.
యంవీ నరసింహారెడ్డి