‘విజయక్రాంతి’ చైర్మన్ సీఎల్‌రాజం ఇంట్లో పతాకాన్ని ఆవిష్కరించిన అవిముక్తేశ్వరానంద స్వామీజీ
హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు, ప్రముఖులు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి, ఆదిశంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ అన్నారు. బుధవారం నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 49లో ‘విజయక్రాంతి దినపత్రిక’ చైర్మన్ చిలప్పగారి లక్ష్మీరాజం ఇంటి ఆవరణలో గోధ్వజ్‌ను ప్రతిష్ఠించారు.
ఈ సందర్భంగా అవిముక్తేశ్వరానందస్వామీజీ గోధ్వజ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఉదయం, మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖులు, భక్తులకు ఆయన ఫలప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అవిముక్తేశ్వరానంద స్వామీజీ మాట్లాడుతూ.. భాగ్యనగరంలో గోప్రతిష్ఠ ఉత్సాహంగా, వైభవంగా జరిగిందని చెప్పారు.
భావితరాలకు దీని ప్రాముఖ్యతను తెలుపుతుందని తెలిపారు. గోవు తల్లిలా భావించి, ఏ బేధం చూపకుండా అందరికీ పాలు ఇస్తుందని పేర్కొన్నారు. గోహత్యను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోరక్షణ కోసం ఎంతో మంది తరలి వస్తున్నారని తెలిపారు.
పూజల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు, ప్రముఖులు
గోధ్వజ్ స్థాపనలో భాగంగా అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామిజీ ‘విజయక్రాంతి దినపత్రిక‘ చైర్మన్ చిలప్పగారి లక్ష్మీరాజం ఇంట్లో బుధవారం వేకువజామున నుంచి రాత్రి వరకు ఐదు రకాల పూజలు చేశారు. ఉదయం 5 గంటలకు విగ్నేశ్వరుడి పూజ, ఏడు గంటలకు సూర్యభగవానుడికి, 10 గంటలకు విష్ణుభగవానుడికి, సాయంత్రం ఐదు గంటలకు చంద్రమేశ్వర భగవానుడికి, రాత్రి ఏడు గంటలకు భగవతి పూజలు చేశారు.
ఈ పూజల్లో ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. విజయక్రాంతి చైర్మన్ చిలప్పగారి లక్ష్మీరాజం, ఎండీ విజయరాజం, వారి కుమారుడు సీ శ్రీకాంత్, కోడలు సీ సౌమ్య, మనుమరాలు శ్రీనిధి, మనుమడు శ్రీనందన్, సీఈవో రాహుల్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. వారితోపాటు పలువురు ప్రముఖులు, భక్తులు పూజల్లో పాల్గొన్నారు.
శ్రీధర్‌బాబు, భక్తులతో స్వామీజీ మాట్లాడి ఫలప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలందించారు. ఈ పూజల్లో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కృష్ణప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వర్‌రావు, శ్రీసాయిలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ, గోధ్వజ్ స్థాపన విజయవాడ కమిటీ అడ్వైజర్ కంటమనేని వెంకటేశ్వరరావు, ప్రముఖ అడ్వకేట్ ఎస్‌కే మిశ్ర, నవయువ ఇంజినీరింగ్, నవయుగ గ్రూప్స్ చైర్మన్ చింత విశ్వేశ్వరరావు, ఎమ్మెల్సీ వాణీదేవి, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్, గోప్రతిష్ఠ ఆందోళన ఉపస్థిత్ దేవేంద్రపాండే, ఏకంభారత్ దళ్ సొసైటీ చైర్మన్ ఎన్కే చతుర్వేది, బీఎస్‌ఎస్‌ఎఫ్ బస్వరాజు శ్రీనివాస్, ప్రతినిధులు సుధాకరశర్మ, వక్కలంక శ్రీనివాస్, రమ్యారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ పాడిన భారతం, భాగవతం, రామాయణం సీడీల పోస్టర్‌ను, లాక్రాన్ క్యూబిక్స్ కంపెనీ లోగో ను, అమెరికాలోని పురోహితుల కోసం హిందూ మహాసంస్థానం రూపొందించిన పోస్టర్‌ను స్వామీజీ ఆవిష్కరించారు.
కాగా, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు లక్డీకాపూల్‌లోని రవీంద్రభారతిలో జరిగిన గోప్రతిష్ఠ ఆందోళన కార్యక్రమంలో అవిముక్తేశ్వరానంద స్వామీజీ పాల్గొన్నారు. కాగా సాయంత్రం వేద పండితుల సమక్షంలో ‘విజయక్రాంతి దినపత్రిక’ ఎండీ సీ విజయరాజం లలితా సహస్రనామ కుంకుమార్చన చేశారు.
నేడు విజయవాడలో గోధ్వజ ప్రతిష్ఠ
అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ బుధవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని సీఎల్ రాజం ఇంట్లో బస చేశారు. గురువారం ఉదయం విజయవాడలో జరిగే గోధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమానికి బయల్దేరుతారు. మధ్యాహ్నానికి విజయవాడకు చేరుకుంటారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
౩౩ రోజులు.. ౩౩ రాష్ట్రాల్లో యాత్ర : సీఎల్ రాజం
అవిముక్తేశ్వరానంద స్వామీజీ తెలంగాణలో కాలుమోపడం అందరికీ మంచిదని విజయక్రాంతి ఎండీ చిలప్పగారి లక్ష్మీరాజం అన్నారు. 33 రోజుల్లో 33రాష్ట్రాల్లో స్వామీజీ గోప్రతిష్ఠ ఆందోళన యాత్ర చేస్తున్నారని చెప్పారు. ఆది శంకరాచార్యులు భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణానికి యాత్ర చేశారని తెలిపారు. ప్రస్తుతం అవిముక్తేశ్వరానంద స్వామి యాత్ర చేస్తున్నారని కొనియాడారు.
మహారాష్ట్రలాగా నిర్ణయం తీసుకోవాలి : ఎండీ విజయరాజం
అవిముక్తేశ్వర్ స్వామీజీ దేశవ్యాప్తంగా గోధ్వజ యాత్ర చేస్తున్నారని, ఆయన తమ ఇంటికి రావడం సంతోషనీయమని విజయక్రాంతి ఎండీ చిలప్పగారి విజయరాజం అన్నారు. మహారాష్ట్రలో గోమాతను రాష్ట్ర మాతగా చేశారని.. తెలంగాణలో కూడా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సప్తమి రోజు తమ ఇంటికి స్వామీజీ రావడాన్ని సంతోషంగా భావిస్తున్నామని చెప్పారు.