భద్రాచలం (విజయక్రాంతి): ముక్కోటి దేవతలు ఒక్కచోటే కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన సంఘటన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం జరిగింది. భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం వారు నిర్వహించిన విశ్వరూప సేవ వైకుంఠాన్ని తలపించింది. భద్రాచలం రామాలయంలోని విగ్రహాలతో పాటు అనుబంధ ఆలయాలలోని ఉత్సవ విగ్రహాలు గజ, అశ్వ, గరుడ, సింహ లాంటి వివిధ దేవత వాహనాలు ఒక్క చోటే ఆసీనులు చేసి ప్రత్యేకంగా ఆరాధించడాన్నే... విశ్వరూప సేవ, సర్వదేవత అలంకరణ సేవ అని పిలుస్తారు. ఈ కార్యక్రమం భద్రాచలం దివ్య క్షేత్రంలో తప్ప, విశ్వవ్యాప్తంగా ఉన్న మరే దేవాలయంలో నిర్వహించకపోవడం విశేషం.
ప్రతి ఏడాది శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల అనంతరం విశ్వరూప సేవ పేరుతో అన్ని దేవేరులను ఆరాధించడం భద్రాచలం రామాలయంలో అనాదిగా వస్తున్న ఆచారం. దీనిలో భాగంగా, ఉదయమే ప్రత్యేక పూజలు అనంతరం అన్ని దేవాలయాల నుంచి తీసుకుని వచ్చిన స్వామివార్ల విగ్రహాలతో పాటు వివిధ దేవేరుల వాహనాలను ప్రత్యేకంగా అలంకరింపజేసి ప్రధాన ఆలయంలోని బేడా మండపం వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై ఆసీనులను చేస్తారు. సాయంత్రం వేద ఘోష నడుమ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఆద్యంతం వైకుంఠాన్ని తలపించగా... వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని సకల దేవతలను ఒక్కసారి దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు అర్చకులు వేద పండితులు సిబ్బంది పాల్గొన్నారు.