calender_icon.png 10 January, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా సదర్ ఉత్సవాలు

03-11-2024 03:46:30 AM

ప్రత్యేక ఆకర్షణగానిలిచిన దున్నపోతులు 

వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): నగరంలో సదర్ ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నారాయణగూడలోని వైఎంసీఏలో నిర్వహించిన వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దున్నపోతుల విన్యాసాలను వీక్షించారు. యాదవులు ప్రతి ఏటా దీపావళి సందర్భంగా సదర్ సమ్మేళనం జరపడం ఆనవాయితీగా వస్తోంది.  దీన్ని దున్నపోతుల ఉత్సవం అని కూడా అంటారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం సదర్ ప్రత్యేకత. నారాయణగూడలో నిర్వహించిన ఉత్సవాల్లో హర్యాణా, పంజాబ్, గుజరాత్ నుంచి తీసుకొచ్చిన గోలు, షేర్, శ్రీకృష్ణ, విదాయక్, రాజా తదితర 9 భారీ దున్నలను ప్రత్యేకంగా అలంకరించి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ పరిధిలో 40కి పైగా ప్రాంతాల్లో సదర్  నిర్వహించారు.   

యాదవ రాజుల కాలం నుంచి

తెలంగాణలో సదర్ ఉత్సవాలు దేవగిరి యాదవ రాజుల కాలంలో వ్యాప్తి చెందాయని చరిత్ర చెబుతోంది. వీరు కాకతీయుల కంటే ముందే ప్రస్తుతం గోల్కొండగా పిలిచే గొల్లకొండను కేంద్రంగా చేసుకొని జీవించేవారని, తర్వాతి కాలంలో గొల్లకొండ ప్రాంతాన్ని పాలించే యాదవుల రాణి.. కుతుబ్‌షాహీ దండయాత్రలను ఐదు దున్నపోతుల సహాయంతో ఎదుర్కొని పోరాడి వీర మరణం పొందిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దున్నపోతుల వీరత్వానికి ప్రతీకగా సదర్ ఉత్సవాలు జరుపుతున్నట్లు చరిత్ర చెబుతోంది. నిజాంల కాలంలో యాదవ వీరులు సైనికాధికారులుగా, అంగరక్షకులుగా సమర్థవంతంగా పనిచేశారని చెబుతుంటారు. సింధు నాగరికతలో భాగం గా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి యాదవులు ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. రాష్ట్ర పండుగగా సదర్ 

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): సదర్ సమ్మేళనాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహించే బాధ్యత పర్యాటక, సాంస్కృతిక శాఖలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖలకు బడ్జెట్‌ను సైతం కేటాయించనున్నట్లు తెలుపుతూ జీవో నెంబర్ 1459ను విడుదల చేశారు.