26-01-2025 12:00:00 AM
ఈ ఏడాది మనం జరుపుకొనే గణతంత్ర దినోత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈ రోజుతో 75 ఏళ్లు పూర్తయ్యాయి.1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అప్పటినుంచి మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ఈ రోజు భారత దేశ రిపబ్లిక్ ప్రస్థానాన్ని గుర్తు చేసుకునే అమృతోత్సవ సందర్భం మాత్రమే కాదు.
రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచిన ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలతో పాటుగా ఈ రోజున ఎదురవుతున్న సమస్యలను, భవిష్యత్ సవాళ్లను పునః పరిశీలించాల్సిన సమయమిది. బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన ’రాజ్యాంగ ప్రవేశిక’లో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, సార్వత్రిక సమానత్వంవంటి విలువలు భారత దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని పరిరక్షించే పునాదులు.
అయితే భారత రాజ్యాంగం నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలో రాజకీయ, పాలనా విధానాలు, రాజ్యాంగ నిబంధలను, దాని మౌలిక సూత్రాలను ప్రశ్నార్థకం చేస్తూ భిన్న సంస్కృతులతో విలసిల్లే దేశాన్ని ఏకీకృత ప్రభుత్వంగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ’భారత దేశం సహకార సమాఖ్య వ్యవస్థను కలిగి ఉంది’ అని కేసీ వేర్ అనే రాజ్యాంగ నిపుణుడు పేర్కొన్నారు. కానీ రాజ్యాంగంలో మాత్రం భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల కలయికగా పేర్కొన్నారు.
కేంద్రం, రాష్ట్రాలమధ్య స్పష్టమైన అధికార విభజనను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాల పేరిట చేశారు. వాటి పరిధుల్లో స్వేచ్ఛగా పని చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ, అధికారాల సమతుల్యతను పాటిస్తూ రూపొందించారు. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమతుల్యాన్ని తన నియంత్రణ విధానాల ద్వారా దెబ్బతీస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఉదాహరణకు డీమానిటైజేషన్, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వంటి ఆర్థిక విధానాలు రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. క్రమంగా రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. మరోవైపు వ్యవసాయంలాంటి రాష్ట్రాల జాబితాలోని అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోంది. వివాదాస్పద రైతు చట్టాలను తీసుకువచ్చి గందరగోళం సృష్టించింది. దీంతో రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో చారిత్రక పోరాటం చేయాల్సి వచ్చింది.
ఫలితంగా ఆ చట్టాలను రద్దు చేయడమే కాకుండా ప్రధాని పార్లమెంటులో రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ రైతుల డిమాండ్లు పూర్తిగా నెరవేరలేదు. మరోవైపు కేంద్రం, రాష్ట్రాల మధ్య వారధిలా పని చేయాల్సిన గవర్నర్లు ప్రజాతీర్పుతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల పనితీరులో జోక్యం చేసుకుంటున్నారు. మైనారిటీల్లో అభద్రతా భావం పెరిగిపోతోంది. ఇవన్నీ నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో సమస్యలు పెరుగుతుండడం విచారకరం.
ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. మరోవైపు రాజ్యాంగం అంటే ఇప్పటికీ చాలామందికి తెలియకపోయినా, అర్థం కాకపోయినా, ఎలాంటి వివక్షా లేకుండా ప్రజలందరినీ అది కంటికి రెప్పలా కాపాడుతోంది. 140 కోట్ల దేశ ప్రజల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు ఊపిరిలూదుతూనే ఉంది. కూటికి లేని వారు, కుబేరులు ఒకే వరసలో నిలబడి ఓటు వేస్తున్నారన్నా, ఇష్టంవచ్చిన మతాన్ని అనుసరిస్తున్నామన్నా, మెరుగైన జీవనం జన్మహక్కుగా మారిందన్నా అది మన రాజ్యాంగం పుణ్యమే.
75 ఏళ్లుగా సామాజిక, ఆర్థిక, లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజందరి జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంది మన రాజ్యాంగం. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలయిన శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయంటే రాజ్యాంగమే కారణం. అందుకే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్ నిలుస్తోంది. అందుకు కారణమైన రాజ్యాంగ నిర్మాతలకు ఘన నివాళి అర్పించడమే కాకుండా వారు చూపించిన బాటలో నడుచుకోవడమే మన కర్తవ్యం.