ఈ వారం స్టాక్ సూచీల కదలికలపై విశ్లేషకుల అంచనాలు
ముంబై, డిసెంబర్ 22: యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల భవిష్యత్ బాటపై షాక్ ఇవ్వడంతో భారీ పతనాన్ని చవిచూసిన మార్కెట్ వెనువెంటనే కోలుకోవాలంటే గ్లోబల్ సంకేతాలు సానుకూలంగా ఉండాలని విశ్లేషకులు తెలిపారు. ఈ క్రమంలో గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా భారత్ స్టాక్ సూచీల కదలికలు ఉంటాయన్నారు.
అలాగే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) ట్రేడింగ్ యాక్టివిటీపై మార్కెట్ దృష్టి నిలిచి వున్నదన్నారు. క్రిస్మస్ సెలవు (డిసెంబర్ 25) కారణంగా నాలుగు రోజులకే ట్రేడింగ్ పరిమితంకానున్న ఈ వారంలో మార్కెట్‌ను కదల్చగల ట్రిగ్గర్లు ఏవీ లేనందున, మార్కెట్ కదలికల్ని గ్లోబల్ ట్రెండ్స్ ప్రభావితం చేస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
అలాగే విదేశీ, దేశీయ సంస్థాగత పెట్టుబడులపై ఆధారపడి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఉంటుందని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు. డాలర్ మారకపు రేటు, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు కూడా మార్కెట్ దిశను నిర్దేశించే అంశాలేనని గౌర్ పేర్కొన్నారు. డిసెంబర్ 20తో ముగిసినవారంలో సెన్సెక్స్ 4,091 పాయింట్లు, నిఫ్టీ 1,180 పాయింట్ల చొప్పున భారీ నష్టాన్ని చవిచూశాయి.
సెన్సెక్స్ 78,041 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,587 పాయింట్ల వద్ద ముగిసాయి. విదేశీ ఇన్వెస్టర్ల వ్యూహం కొనుగోళ్ల నుంచి విక్రయాలవైపునకు హఠాత్తుగా మారడం స్టాక్స్‌ను ప్రభావితం చేస్తున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు.
ఈ వారంలో ప్రధాన ఈవెంట్స్ లేనప్పటికీ, యూఎస్ బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ కదలికలు, యూఎస్ జాబ్‌లెస్ క్లెయింల డేటా వంటివి మార్కెట్ ట్రెండ్‌ను కొంతమేర ప్రభావితం చేస్తాయని ప్రవేశ్ గౌర్ వివరించారు.
తిరిగి ఎఫ్‌పీఐ విక్రయాలు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్లు (ఎఫ్‌పీఐలు) మళ్లీ అమ్మకాలకు ఉపక్రమించారు. గత వారంలో ఎఫ్‌పీఐలు రూ.976 కోట్లు వెనక్కు తీసుకున్నట్లు డిపాజిటరీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతవారం తొలి రెండు ట్రేడింగ్ సెషన్లలో రూ. 3,126 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా కొన్న ఎఫ్‌పీఐలు చివరి మూడు రోజుల్లో ట్రెండ్ మార్చి రూ. 4,102 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.
వరుస రెండు నెలల భారీ విక్రయాల అనంతరం డిసెంబర్ నెల తొలి రెండు వారాలో దేశీయ స్టాక్స్‌లో నికరంగా రూ.22,766 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.94,017 కోట్లు, నవంబర్‌లో రూ.21,612 కోట్ల చొప్పున ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్లో నికర విక్రయాలు జరిపారు. ఈ 2024 సంవత్సరంలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.6,770 కోట్లకు చేరినట్లు డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది.
రానున్న రోజుల్లో భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ అమలుపర్చే విధానాలు, ద్రవ్యోల్బణం ట్రెండ్, కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల సరళిపై ఆధారపడి ఉంటాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.
డిసెంబర్ డెరివేటివ్స్ ముగింపుతో ఒడిదుడుకులు
ఈ పరిమిత ట్రేడింగ్ వారంలో డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ఉన్నందున, వచ్చే కొద్ది రోజులూ మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అంచనా వేశారు. ఈ వారంలో ఇన్వెస్టర్లు విదేశీయుల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్ల కదలికలను జాగ్రత్తగా గమనిస్తారని, డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ మార్కెట్‌ను హెచ్చుతగ్గులకు లోనుచేస్తుందని వివరించారు.