calender_icon.png 12 October, 2024 | 1:52 PM

గ్లోబల్ సంకేతాలే ఆధారం

30-09-2024 12:00:00 AM

ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌పై విశ్లేషకుల అంచనాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29:  ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్‌లు యూఎస్ ఫెడ్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాలు వరుసగా వడ్డీ రేట్లను తగ్గించడంతో గతవారం పలు ప్రధాన ప్రపంచ మార్కెట్లతో పాటు భారత్ స్టాక్ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. ఈ వారం సైతం ఇన్వెస్టర్లు గ్లోబల్ ట్రెండ్స్‌పైనే దృష్టి నిలుపుతారని, అందుకు అనుగుణంగానే మన మార్కెట్ కదలికలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యూఎస్ కేంద్ర బ్యాంక్ మార్కెట్ అంచనాల్ని మించి 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేటును, బ్యాంక్ రిజర్వ్ రేషియోను తగ్గించడంతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చే ఆర్థిక ప్యాకేజీకి ప్రకటించింది. ఈ అంశాల నేపథ్యంలో సెన్సెక్స్ గతవారం తొలిసారిగా 85,000 పాయింట్ల స్థాయిని అధిగమించి, 85,978 పాయింట్ల   వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది.   

ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,277 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది. గత వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,027 పాయింట్లు, నిఫ్టీ 388 పాయింట్ల చొప్పున పెరిగాయి. నాలుగు రోజుల ట్రేడింగ్‌కే పరిమితంకానున్న ఈ వారం మార్కెట్‌కు గ్లోబల్ సంకేతాలతో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) ట్రేడింగ్ యాక్టివిటీ కీలకమని విశ్లేషకులు తెలిపారు.

మహాత్మాగాంధి జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మార్కెట్లకు సెలవు. ప్రపంచ మార్కెట్లో కమోడిటీ ధరల కదలికలు, యూఎస్ డాలర్ ఇండెక్స్ ట్రెండ్, యూఎస్‌లో విడుదల కానున్న కీలక ఆర్థిక గణాంకాలు కూడా మార్కెట్ దిశను నిర్దేశిస్తాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు.

దేశీయంగా మార్కెట్‌ను కదల్చగల పెద్ద అంశాలేవీ లేనందున, ఈ వారం మార్కెట్ ట్రెండ్‌కు గ్లోబల్ సంకేతాలే కీలకంగా ఉంటాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. 

ఎఫ్‌పీఐ పెట్టుబడులు రూ.57,000 కోట్లు

యూఎస్ వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో ఈ సెప్టెంబర్ నెలలో  విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత మార్కెట్లో  రూ.57,000 కోట్లకుపైగా కుమ్మరించారు. ఇంత పెద్ద మొత్తంలో విదేశీ ఈక్విటీ పెట్టుబడులు తరలిరావడం గత తొమ్మిది నెలల్లో ఇదే ప్రధమం. 

2023 డిసెంబర్‌లో ఎఫ్‌పీఐలు రూ.66,135 కోట్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ సెప్టెంబర్‌లో పెట్టుబడులే అత్యధికం.  డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈ నెల 27వ తేదీవరకూ దేశీయ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు రూ.57,359 కోట్లు నికరంగా ఇన్వెస్ట్ చేశారు. దీనితో 2024లో ఇప్పటివరకూ దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.1 లక్ష కోట్లను మించాయి. 

 రానున్న రోజుల్లోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడుల ట్రెండ్ కొనసాగుతుందని  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అంచనా వేశారు. ఫెడ్ భారీగా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును తగ్గించడం, యూఎస్ 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ 3.7 శాతానికి దిగిరావడంతో భారత్‌తో సహా ఇతర వర్థమాన మార్కెట్లలో పెట్టుబడులకు ఎఫ్‌పీఐలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. 

ఆటో సేల్స్‌పై దృష్టి

సెప్టెంబర్ నెలలో ఆటోమొబైల్ అమ్మకాల డేటాను వివిధ కంపెనీలు అక్టోబర్ 1న వెల్లడిస్తాయి. ఆటోసేల్స్ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని, అలాగే ఆయా కంపెనీలు వెల్లడించే త్రైమాసికపు అప్‌డేట్స్ సైతం స్టాక్స్‌ను హెచ్చుతగ్గులకు లోనుచేస్తాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ వివరించారు.

ఈ వారం విడుదలయ్యే తయారీ, సర్వీసుల పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) డేటా మార్కెట్ ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తుందన్నారు.  అక్టోబర్ 1న విడుదల కానున్న ఆటో సేల్స్ డేటా కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్నారని అజిత్ మిశ్రా తెలిపారు. 

 పాజిటివ్ సెంటిమెంట్

అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ప్రస్తుతం భారత్ మార్కెట్‌పై అమితాసక్తి ఉన్నందున, దేశీయంగా పాజిటివ్ సెంటిమెంట్ నెలకొన్నదని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ ఖెమ్కా తెలిపారు. సెప్టెంబర్ ద్వితీయార్థంలో  విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు చేసినందున,  విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ యాక్టివిటీ ఈ వారం కూడా మార్కెట్ కదలికలకు కీలకమని విశ్లేషించారు.

యూఎస్ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నదన్న ఆందోళనలు తగ్గడంతోపాటు ఫెడ్ రేట్ల కోతతో విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయని, తద్వారా దేశీయ మార్కెట్లో పాజిటివ్ మూమెంటం నెలకొన్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. చైనా ఆర్థిక ఉద్దీపన ప్రకటనలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించాయని, దీనితో గ్లోబల్ మార్కెట్లు, ప్రత్యేకించి ఆసియా స్టాక్ సూచీలు దూసుకెళుతున్నాయన్నారు.