calender_icon.png 18 November, 2024 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ సంకేతాలే ప్రధానం

18-11-2024 12:33:36 AM

ఈ వారం మార్కెట్ ట్రెండ్‌పై విశ్లేషకుల అంచనాలు

న్యూఢిల్లీ, నవంబర్ 17: గ్లోబల్ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ యాక్టివిటీ ఈ వారం మార్కెట్ ట్రెండ్‌కు కీలకమని విశ్లేషకులు చెప్పారు. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. నవంబర్ 20 బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా  స్టాక్ ఎక్సేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు సెలవు ప్రకటించాయి.

ఓట్ల లెక్కిం పు 23న జరుగుతుంది. బ్రెంట్ క్రూడ్ ధర లు, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి/డాలర్ పెయిర్ ట్రెండ్ కూడా ఈ వారం మార్కె ట్  దిశను నిర్దేశిస్తాయని అనలిస్టులు వివరించారు. పలు అంశాలతో ముడిపడిన ఈ వారంలో కూడా మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని వారు అంచనా వేస్తు న్నారు. 

గత వారం మొత్తంమీద సెన్సెక్స్  భారీగా 1,906 పాయింట్లు పతనమై 77,580 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 616 పాయింట్ల మేర క్షీణించి 23,532 పాయింట్ల వద్ద ముగిసాయి. 

రికార్డు గరిష్ఠం నుంచి 8,398 పాయింట్లు పతనం

బీఎస్‌ఈ సెన్సెక్స్ రికార్డు గరిష్ఠస్థాయి నుంచి ఇప్పటికి 8,398 పాయింట్ల (9.76 శాతం) భారీ పతనాన్ని చవిచూసింది. నిఫ్టీ 2,745 పాయింట్లు (10.44 శాతం) కోల్పోయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న సెన్సెక్స్ 85,978 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పగా, నిఫ్టీ అదేరోజున 26,277 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయిని నమోదు చేసింది.

భారత్ మార్కెట్ అధిక విలువ, కార్పొరేట్ల క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపర్చడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఈక్విటీలను విక్రయించడంతో స్టాక్ సూచీ లు తీవ్ర పతనాన్ని చవిచూశాయి. బలహీన క్యూ2 ఫలితాలు, డాలర్ ఇండెక్స్ బలోపేతంకావడంతో గత ఆరువారాలుగా ఎఫ్‌పీఐలు విక్రయాలు జరుపుతున్నారని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ ఖెమ్కా తెలిపారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై దృష్టి

ఈ వారం ఇన్వెస్టర్లు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై సైతం దృష్టిపెట్టారని విశ్లేషకులు చెప్పారు. ఈ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్, వాస్తవ ఫలితాల ప్రభావం కొంత మేర మార్కెట్‌పై ఉంటుందన్నారు. అయితే ప్రధానంగా అంతర్జాతీయ సంకేతాలే కీలకమని, యూఎస్ బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ ప్రదర్శనతో పాటు ఈ వారం వెలువడనున్న యూఎస్ జాబ్‌లెస్ క్లెయింలు, మాన్యుఫాక్చరింగ్, సర్వీస్ పీఎంఐ డేటా ప్రపంచ మార్కెట్లను, తద్వారా భారత సూచీలను ప్రభావితం చేస్తాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ వివరించారు. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 22,420 కోట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) నిధుల తరలింపు కొనసాగుతున్నది. నవంబర్ నెలలో ఇప్పటివరకూ రూ.22,420 కోట్లు ఎఫ్‌పీఐలు వెనక్కు తీసుకున్నారు. అక్టోబర్ నెల మొత్తంలో రికార్డుస్థాయిలో రూ. 95,000 కోట్లకుపైగా విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించారు.

ఇప్పటివరకూ 2020 మార్చిలో ఎఫ్‌పీఐలు విత్‌డ్రా చేసుకున్న రూ. 61,973 కోట్లే అత్యధికం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఏడాది గరిష్ఠంగా రూ.57,724 కోట్లు ఇన్వెస్ట్‌చేసిన విదేశీ ఫండ్స్ ఆ మరుసటి నెలలోనే రికార్డు విక్రయాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం.

ట్రంప్ ట్రేడ్ యూఎస్‌కు షిఫ్ట్

అక్టోబర్‌లో ఎఫ్‌పీఐల అమ్మకాలకు ప్రధాన కారణం చైనాలోకి పెట్టు బడుల్ని మళ్లించడంకాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందునుంచి యూఎస్ మార్కెట్లపై ఎఫ్‌పీఐలు గురిపెట్టారని, నవంబర్‌లో ఎఫ్‌పీఐలు భారత్, చైనాలతో పాటు ఇతర వర్థమాన మార్కెట్ల నుంచి నిధుల్ని యూఎస్ మార్కెట్‌కు తరలిస్తున్నారని క్యాప్రైజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ పియూష్ మెహతా చెప్పారు.

గరిష్ఠస్థాయి నుంచి భారత్ మార్కెట్ 10 శాతం పడిపోగా, చైనా మార్కెట్లు సైతం 10 శాతం క్షీణించాయని, యూఎస్ మా ర్కెట్ మాత్రం  10-12 శాతం ర్యాలీ జరిపిందని మెహతా వివరించారు. ఈ సంవత్సరాంతం వరకూ ఎఫ్‌పీఐల పెట్టుబడులు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం తక్కువని, అందుచేత స్థానిక మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగానే ఉంటుందని ఫైనాన్షియల్ అడ్వయిజరీ ఫోర్విస్ మజార్స్ పార్టనర్ అఖిల్ పురి అంచనా వేశారు.