calender_icon.png 15 October, 2024 | 3:44 AM

గ్లోబల్ సంకేతాలే కీలకం

19-08-2024 12:00:00 AM

ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, ఆగస్టు 18:  కార్పొరేట్ ఫలితా ల సీజన్ ముగింపునకు వచ్చినందున ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలు గ్లోబల్ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ యాక్టివిటీపై ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు అం చనా వేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశపు మినిట్స్ ఈ వారం విడుదలవుతాయని, రేట్ల కోతపై కమిటీ సభ్యుల అభిప్రాయాలు అంతర్జాతీయ మార్కెట్లను తద్వారా దేశీయ స్టాక్ సూచీలను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

క్యూ1 ఫలితాల సీజన్ ముగిసిందున దేశీయంగా ప్రభావితం చేసే స్థూల, సూక్ష్మ ఆర్థిక అంశాలేవీ లేవని, అయితే అంతర్జాతీయంగా జపాన్ ద్రవ్యోల్బణం గణాంకాలు, ఫెడ్ కమిటీ మినిట్స్‌ను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. క్రూడాయిల్ ధరలు, సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ట్రేడర్లు దృష్టిపెడతారని తెలిపారు. అమెరికా మాంద్యంలో చిక్కుకుంటుందన్న భయాలు తొలగడంతో శుక్రవారం గ్లోబల్ మార్కెట్లు ర్యాలీ జరిపాయి. శుక్రవారం సెన్సెక్స్ 1,330 పాయింట్లు పెరిగి 80,436 పాయింట్ల వద్ద ముగిసింది. గత రెండు నెలల్లో సెన్సెక్స్ ఇంతగా లాభపడటం ఇదే ప్రధమం. నిఫ్టీ 297 పాయింట్లు ర్యాలీ జరిపి 24,541 పాయింట్ల వద్ద నిలిచింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 730 పాయింట్లు, నిఫ్టీ 173 పాయింట్ల చొప్పున పెరిగాయి. 

ఎఫ్‌పీఐల నికర అమ్మకాలు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) గతవారం రూ.8,616 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు. ఈ నెలలో ఇప్పటివరకూ వారు రూ.21,000 కోట్ల మేర ఈక్విటీ మా ర్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు. గడిచిన వారంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.10,500 కోట్లు నికర పెట్టుబడులు పెట్టారు. వరుసగా రెండు నెలలు కొనుగోళ్లు జరిపిన ఎఫ్‌పీఐలు ఆగస్టులో మాత్రం పలు అంతర్జాతీయ, దేశీయ అంశాల కారణంగా పెట్టుబడుల్ని ఉపసంహరిం చు కున్నట్టు విశ్లేషకులు తెలిపారు. ఈక్విటీ డెరివేటివ్స్‌లో ఎఫ్‌పీఐలు గతవారం ఇండెక్స్ ఫ్యూచర్లను భారీగా విక్రయంచినప్పటికీ, శుక్రవారం గణనీయంగా షార్ట్ కవరింగ్ జరిపారని, దీంతో వారి లాంగ్ షార్ట్ రేషియో 50:50 వద్ద నిలిచిందని విశ్లేషకులు వెల్లడించారు.

తొలగిన యూఎస్ మాంద్యం భయాలు

అమెరికా ద్రవ్యోల్బణం మూడేండ్ల కనిష్ఠస్థాయికి తగ్గడం, రిటైల్ అమ్మకాలు పెరగడంతో మాంద్యం భయాలు తొలగిపోయాయని, వచ్చే నెలలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలతో గ్లోబల్ ఈక్విటీల్లో మెగా ర్యాలీ జరిగిందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి వివరించారు.  ఈ వారం మార్కెట్‌ను ఫెడ్ మినిట్స్, యూఎస్ హోం సేల్స్ డేటా ప్రభావితం చేస్తాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్ అరోరా చొప్రా తెలిపారు. అందరి దృష్టి ఈవారం వెలువడే ఫెడ్ మీటింగ్ మినిట్స్‌పైనే ఉన్నదని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా చెప్పారు. ఆగస్టు 21 బుధవారం ఫెడ్ మీటింగ్ మినిట్స్ వెల్లడవుతాయి. 

నిఫ్టీకి సమీప అవరోధం 24,700

గతవారం నిఫ్టీ సూచి కన్సాలిడేషన్ ఫే జ్ నుంచి బ్రేక్‌అవుట్ అయ్యిందని, దీని తో ఈ వారం పాజిటివ్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల ఆరంభంలో బ్రేక్‌డవున్ స్థాయి 24,700 పాయింట్ల వద్ద ఈ నిఫ్టీకి తొలి అవరోధం కలగవచ్చని, అప్పటి గ్యాప్‌ను ఫిల్ చేస్తే మళ్లీ 25,078 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్ఠంవైపుగా ప్రయాణించవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. ఈ వారం తగ్గుదల సంభవిస్తే 24,300 శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నదని, 24,000 స్థాయి వద్ద ప్రధాన మద్దతు ఉన్నదని తెలిపారు.

ఎంపికచేసిన షేర్లు మాత్రమే పెరుగుతున్నందున, షేర్ల ఎంపికపై ఇన్వెస్టర్లు దృష్టిసారించాలని సూచించారు. తామ ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకింగ్ షేర్లపై మొగ్గు చూపిస్తున్నట్టు మిశ్రా వెల్లడించారు. టెక్నికల్ చార్టుల్లో నిఫ్టీ బ్రేక్‌అవుట్‌ను కనపర్చినందున, మార్కెట్లో మరింత బుల్లిష్ మూమెంటం నెలకొంటుందని, 24,800 కీలక నిరోధస్థాయిగా ఉంటుందని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ విశ్లేషకుడు సంతోష్ మీనా అంచనా వేశారు. వీక్లీ క్యాండిల్ బుల్లిష్‌గా ఉన్నదని, ఈ వారం నిఫ్టీ 24,600 స్థాయిని దాటితే 24,800 స్థాయివైపు పయనిస్తుందని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్ అరోరా చొప్రా విశ్లేషించారు. 

ఈ వారం ఎక్స్‌డివిడెండ్ కంపెనీలివే

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఈ వారం పలు కంపెనీలు డివిడెండు చెల్లింపునకు రికార్డుతేదీలు ప్రకటించినందున, అవి ఎక్స్‌డివిడెండ్‌తో ట్రేడ్ కానున్నాయి. అందులో పలు బ్లూచిప్ కంపెనీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు ఉన్నాయి. అవి..రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఆర్‌సీటీసీ, ఏబీబీ ఇండియా, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఐఆర్‌ఎఫ్‌సీ, జిందాల్ స్టీల్ అండ్ పవర్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఫైజర్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌లు.