బరిలోకి దిగనున్న నీరజ్ చోప్రా
ఛండీగర్: భారత్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న గ్లోబల్ జావెలిన్ త్రో కాంపిటీషన్‌లో భారత స్టార్ నీరజ్ చోప్రా బరిలోకి దిగే అవకాశముంది. ఈ మేరకు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2029లో వరల్డ్ చాంపియన్‌షిప్స్ నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్న భారత్.. ఈ టోర్నీ నిర్వహణతో వరల్డ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్‌కు తమ అభిప్రాయాన్ని తెలపనున్నట్లు ఏఎఫ్‌ఐ పేర్కొంది. 2028 వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహణకు తాము ఆసక్తిగా ఉన్నట్లు గతేడాది నవంబర్‌లో భారత్ పర్యటనకు వచ్చిన ఏఎఫ్‌ఐ అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్ చీఫ్ సెబాస్టియన్ కోతో ఈ విషయాన్ని పంచుకుంది. ఈ టోర్నీలో నీరజ్ చోప్రా పాల్గొనడమే కాకుండా ఆర్గనైజేషన్‌లోనూ యాక్టివ్ రోల్ పోషించనున్నట్లు ఏఎఫ్‌ఐ తెలిపింది. ఇటీవలే ఏఎఫ్‌ఐ నూతన చీఫ్‌గా 2002 ఆసియా గేమ్స్ షాట్‌పుట్ స్వర్ణ పతక విజేత బహదూర్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవెల్ ఈవెంట్‌కు ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఆతిథ్యమివ్వనుంది. 2004లో వరల్డ్ హాఫ్ మారథాన్ చాంపియన్‌షిప్స్‌కు భారత్ ఆతిథ్యమిచ్చింది.