calender_icon.png 27 September, 2024 | 4:56 AM

గ్లోబల్ ఫౌండేషన్.. స్టార్టింగ్ కరప్షన్!

26-09-2024 01:03:23 AM

  1. సేవల పేరిట నిరుద్యోగులకు శఠగోపం 
  2. పాఠశాలకు రెండు పోస్టులంటూ ప్రచారం 
  3. పోస్ట్‌కు రూ.1.50 నుంచి రూ.3 లక్షల వరకు డిమాండ్
  4. గతంలోనూ ఓ ఏజెన్సీ పేరిట లక్షలు వసూలు  

సూర్యాపేట, సెప్టెంబర్ 25: ఆలోచన ఉండాలేగానీ అవినీతికి అవధులు ఉండవు అన్న చందంగా సమాజంలోని కొందరు వ్యక్తులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇతరులను నేరుగా మోసం చేసి సంపాదించుడు ఒక రకమైతే.. సేవ చేస్తామన్న పేరు చెప్పుకొని చేతివాటం ప్రదర్శించే వారు మరికొందరు.

రెండో రకం మోసం తాజాగా సూర్యాపేట జిల్లాలో ప్రారంభమైనట్టు తెలుస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కొన్ని రకాల ఉచిత సేవలు చేసేందుకు అవకాశం కల్పించాలని ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకోగా, వారి అనుమతితో జిల్లా విధ్యాశాఖాధికారులు ప్రోసీడింగ్ లెటర్లు పంపించారు.

దీనిని ఆసరాగా తీసుకుని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానన్న ప్రచారం చేస్తూ కొందరి నుంచి జిల్లాలోని ఓ వ్యక్తి లక్షల రూపాయలు వసూళ్లకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

గతంలోనూ ఏజెన్సీ పేరిట మోసాలు

ఫౌండేషన్ ఇన్‌చార్జిని తానేనని చెప్పుకొంటున్న సదరు వ్యక్తి గతంలో సూర్యాపేటలో ఓ ప్రైవేటు ఏజెన్సీ ఏర్పాటు చేసి పలు సంస్థల్లో ఉద్యోగాల పేరిట సుమారు వంద మంది నుంచి రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అప్పుడు మోసం చేసిన వ్యక్తే ఉద్యోగాల పేరుతో మరోసారి మోసాలకు సిద్ధమయినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పోస్టులు మంజూరైయినట్టు చెప్తూ.. సూర్యాపేట మండలంలోని టేకుమట్ల, పిల్లలమర్రి, ఇమాంపేట పోస్ట్‌లకు నిరుద్యోగులతో బేరం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ విషయం అందరికి తెలుస్తుండటంతో ఆశావహులు సమగ్ర శిక్షలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులను సంప్రదించగా, అసలు విషయం వెలుగు చూసింది. 

ఆగడాలకు అడ్డుకట్ట పడేనా? 

గతంలో జరిగిన మోసాలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి ఆగడాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలని మేధావులు, విద్యావంతులు కోరుతున్నారు. ఫౌండేషన్ ద్వారా ఉచిత సేవలు అందించాలంటే నిజమైన అర్హతలు ఉన్న వ్యక్తులను గుర్తించి, వారికి మాత్రమే నిజాయితీగా ఇవ్వాలని కోరుతున్నారు.

డబ్బుతో కొనుక్కొన్న వారితో ఉద్యోగాలు చేయిస్తే అసలు సమస్యలు తీరకపోగా కొత్త సమస్యలు వచ్చిపడతాయని ఆరోపిస్తున్నారు. దీంతో అటు అధికారులు, ఇటు విద్యార్ధులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

ఎలాంటి మోసాలకు అవకాశాలు లేకుండా జిల్లా అధికారులు తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మోసానికి  కొంత మంది జిల్లాస్థాయి అధికారుల ప్రోద్బలం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై డీఈవోను ఫోన్ ద్వారా సంప్రదించగా  అందుబాటులోకి రాలేదు.  

ఉచిత సేవ పేరిట వసూళ్లకు రంగం

గ్లోబల్ ఫౌండేషన్ అనే సంస్థ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కొన్ని ఉచిత సేవలు అందిస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను అభ్యర్థించగా,అనుమతిస్తూ జిల్లా విధ్యాశాఖాధికారులకు ప్రోసీడింగ్ కాపీలను పంపించారు. అయితే, అది ప్రస్తుతం కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గ్లోబల్ ఫౌండేషన్‌కు సూర్యాపేటతోపాటు మరో రెండు జిల్లాలకు తానే ఇన్‌చార్జినని ప్రచారం చేసుకున్నాడు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఒక స్కిల్ అసిస్టెంట్, ఒక అటెండర్ పోస్ట్‌ను ఫౌండేషన్ ద్వారా నియమించి, నెలనెలా జీతం అందించనున్నట్టు చెప్పారు. ఉద్యోగం కావాలంటే పోస్ట్‌కు రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

నిరుద్యోగులే టార్గెట్

ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్న ని రుద్యోగుల్లో ఆశలు కల్పించి, వారితోనే బేరసారాలు ఆడుతున్నట్టు సమాచారం. గ్రామాల్లో ఉండే కొందరు నిరుద్యోగులు ఈ పోస్ట్‌లో జాయిన్ అయితే ఇంటి వద్ద నే ఉంటూ ఉద్యోగం చేసుకోవడంతో పా టు ఇతర వ్యాపకాలు కొనసాగించవచ్చ నే ఆలోచనతో డబ్బులు ఇచ్చైనా చేరేందుకు సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిసింది.