calender_icon.png 27 September, 2024 | 3:13 AM

పాఠాలు చెబుతూ.. వైద్యులుగా తీర్చిదిద్దుతూ!

24-09-2024 12:00:00 AM

‘వైద్యో నారాయణ హరి’ అనే మాటలను నిజం చేసి చూపిస్తున్నారు డాక్టర్ విజయ్ మోహన్. ఆయన వైద్యం చేయడమే కాకుండా.. ఎంతోమంది మెడికో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. తన ఇంటినే తరగతి గదిగా మార్చేసి.. భావితరాల డాక్టర్లను సమాజానికి అందిస్తున్నారు. ఈ సందర్భంగా తన జర్నీని పంచుకున్నారాయన.

‘కేర్ హాస్పిటల్స్‌లో సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్‌గా రెండు దశాబ్దాల పాటు పనిచేశాను. వైద్యవృత్తిలో ఎంతో అనుభవం ఉంది. అయితే నేను నేర్చుకున్న బోధనా పద్ధతులు.. అనుభవాలు, ఇతరులకు తెలియజేయాలన్నదే నా సంకల్పం. అందుకే చికిత్సలోని కొత్త కొత్త పద్ధతులను పరిచయం చేస్తూ పాఠాలు చెబుతున్నా. దేశవిదేశాల నుంచి విద్యార్థులు నా మార్గదర్శకత్వం కోరి శిక్షణ కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు.

బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తుండటమే ఇందుకు కారణం. టీచింగ్ కోసం బర్కత్‌పురాలోని ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్‌ను తరగతిగదిగా మార్చాను. కొన్నేళ్లుగా పీజీ మెడికోలకు బోధిస్తున్నా. ఈక్రమంలో క్లినికల్ మెడిసిన్, న్యూరో క్రిటికల్ కేర్, కార్డియో డయాబెటాలజీ, హార్ట్ ఫెయిల్యూర్స్, మెటబాలిక్ సిండ్రోమ్, హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ వంటి అంశాలు విద్యార్థులకు నేర్పించి పట్టు సాధించేలా చేశా. ఇవీ నాలో కూడా ఆసక్తిని రేపాయి.  

మార్పులు చాలా అవసరం

లాక్‌డౌన్ సమయంలో వైద్య విద్యార్థులకు 150 ఆన్‌లైన్ క్లాసులు తీసుకున్నా. ఆ సమయంలో వైద్య కాలేజీలు మూతపడటంతో ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పాల్సి వచ్చింది. ఇక కరోనాపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించా. ఆ సమయంలో నిర్వహించిన సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 1,500 మంది వైద్యులు హాజరయ్యారు. ఎన్నో ఆధునిక వైద్య పద్ధుతులను తెలియజేశాను. ఇక నా సేవలను గుర్తించిన ఇతర దేశాల విశ్వవిద్యాలయాలు ఉపన్యాసాలు ఇవ్వడానికి  ఆహ్వానించాయి. మూడు అమెరికన్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్స్ లో క్షయవ్యాధిపై ఉపన్యాసాలు ఇచ్చా. 

అయితే వైద్య విద్య పాఠ్యప్రణాళికలో మార్పులు అవసరం. సమాజ అవసరాలకు అనుగుణంగా.. మారుతున్న జనాభాకు అనుగుణంగా ప్రస్తుత వైద్య విద్యా వ్యవస్థను సవరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయుర్దాయం పెరగడం వల్ల భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుతోంది. అందువల్ల రక్తపోటు, స్ట్రోక్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, అల్జీమర్స్ వంటి వ్యాధులు ఇబ్బందికరంగా మారాయి. ఈక్రమంలో యాంటీబయాటిక్స్ దుర్వినియోగం కావడం. డాక్టర్లు, నర్సుల కొరత వైద్యరంగానికి అడ్డంకిగా మారాయి. అందుకే ప్రస్తుత వైద్య విధానం మారాలి అనేది నా ఉద్దేశం.

ఆరోగ్య ప్రమాణాలు పెంచాలి

వైద్యం అందరికీ అందాలంటే ఆరోగ్య ప్రమాణాలు పెంచాలి. ఇందుకోసం ప్రభుత్వం బోధనా ప్రమాణాలను ఏర్పాటు చేయడానికి ‘నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ బోర్డు’ లేదా ’మెడికల్ టీచింగ్ స్టాండర్డ్ అసెస్మెంట్ బోర్డు’ను ఏర్పాటు చేయాలి. అన్ని వైద్య కళాశాలల్లో అధ్యాపకుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ ప్రమాణాలను కాలానుగుణంగా మదింపు చేయాలి. వైద్య విద్యావిధానంలో ఇలాంటి సవరణలు ఆరోగ్య ప్రమాణాలను పెంచగలవు” అని అన్నారు డాక్టర్ విజయ్ మోహన్.