- ఫేక్ సర్టిఫికెట్లతో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు పొందారు
- మాతో సమానంగా వారికీ వెయిటేజీ ఇస్తే నష్టపోతాం
- ఆరోగ్య శాఖలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన
సిద్దిపేట, నవంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న 1,280 గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు మెడికల్ హెల్త్ సెర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్ష నిర్వహించింది. కాగా ఆరోగ్య శాఖలో అయిదేండ్లు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధా నంలో ఉద్యోగం చేస్తున్న వారికి 20 మార్కులు వేయిటేజ్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని ఆరోగ్యశాఖలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య రగడ మొదలైంది. డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా ఎన్నికై 20 ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్న తమతో పాటు..
ఎలాంటి నిబంధనలు లేకుండా, గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఉద్యోగాలు పొందిన వారికి కూడా వెయిటేజీ ఇస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి డీఎస్సీ ద్వారా ఎంపికైన అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల్లో వేయిటెజీ ఇవ్వాలని కోరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలే అధికం!
ఎలాంటి అర్హతలు లేకున్నా గత ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలే చాలా మంది ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు పొందారని.. ప్రస్తుత నియామకాల్లో వారికి వెయిటేజీ ఇస్తే అనర్హులకే మళ్లీ ఉద్యోగాలు దక్కే అవకాశాలు ఉంటాయని ఆరోపిస్తున్నారు.
కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ నియమాకాలకు ఉద్యోగ నోటిఫికేషన్ జారీచేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయల్సి ఉంటుందని.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ నిబంధనలకు పకడ్బందీగా అమలు చేయగా, 2014 తర్వాత ఈ నిబంధనలను పాటించలేదని బాధితులు వాపోతున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియామకాలు చేపట్టి, వారికి నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆరోపిస్తున్నారు.