06-03-2025 12:00:00 AM
గజ్వేల్, మార్చి5: పొదుపు పాలసీల ద్వారా సహారా ఇండియాలో దాచుకున్న తమ డబ్బును వెంటనే చెల్లించాలంటూ డిపాజిటర్లు బుధవారం గజ్వేల్ లోని సహారా ఇండియా కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. గజ్వేల్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు సహారా ఇండియాలో తమ డిపాజిట్ చేసిన పాలసీలు గత రెండేళ్ల క్రితమే గడువు పూర్తి కావడంతో డిపాజిట్ మొత్తాన్ని చెల్లించాలని సహారా ఇండియా సిబ్బందిని కోరారు.
ఎన్నిసార్లు ఆఫీసుకు వచ్చి వెళ్లినా నెల, రెండు నెలలు అంటూ గడువు పెట్టడమే తప్ప డబ్బులు ఇవ్వడం లేదని పాలసీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష నుండి 10 లక్షల వరకు డిపాజిట్లు తిరిగి చెల్లించకుండా సిబ్బంది మాట దాటి వేస్తూ డిపాజిటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
సహారా ఇండియా పై ఆర్థిక నేరారోపణల నేపథ్యంలో కోర్టులో కేసులు కొనసాగుతున్నా ఏజెంట్లు డిపాజిటర్లకు మాయ మాటలు చెబుతూ డబ్బులు వసూలు చేస్తూ కార్యాలయంలో జమ చేస్తున్నారని, కొందరు లబ్ధిదారులు కట్టిన డబ్బులకి, కంపెనీకి సంబంధించిన వ్బుసైట్లో ఉన్న డబ్బుల వివరాలకు పొంతన లేకపోవడంతో డిపాజిటర్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిపాజిట్ చేసిన డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో సరైన వివరణ సిబ్బంది ఇవ్వకపోవడం ప్రజల్లో మరింత అనుమానాలకు తావిస్తుంది. కంపెనీ సిబ్బంది ఏజెంట్లు సహారా ఇండియా పేరు చెప్పుకొని వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు వెల్లడించారు. బాధితులలో ఎక్కువగా వృద్ధులై ఉండడం గమనార్హం.