09-02-2025 12:51:16 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామ న్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. అలాగే, ప్రభుత్వానికి భారంగా మారిన గత సర్కార్ చేసిన రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
శనివారం ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్ర ఆర్థిక వనరుల సమస్యలపై 8 అంశాలతో వినతిపత్రాన్ని భట్టి అందజేశారు. ఏపీ పునర్విభజన సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు లేఖలు ఇచ్చామని వివరించారు. భట్టి వెంట రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు.
నిర్మలకు డిప్యూటీ సీఎం చేసిన విజ్ఞప్తులు..
* పదేళ్లలో బీఆర్‌ఎస్ సర్కార్ దాదాపు రూ.6.71లక్షల కోట్లు అప్పు చేసింది. బడ్జెట్, బడ్జెటేతర రుణాలకు సంబంధించిన అప్పుల వడ్డీలకు ఏటా రూ.40వేల కోట్లు కడుతున్నాం. రుణాల రీస్ట్రక్చర్ చేస్తే వడ్డీల భారం తగ్గుతుంది.
* ఉమ్మడి సంస్థల నిర్వహణకు సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రూ.408 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఇప్పించండి.
* ఏపీ పునర్విభజన చట్టం కింద తెలంగాణకు వెనుకబడిన జిల్లాల నిధులు రూ.1,800 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలి. అలాగే, కొత్తగా రావాల్సిన నిధులను కూడా విడుదల చేయాలి.
* 2014 తెలంగాణకు రావాల్సిన రూ.495 కోట్ల సీఎస్‌ఎస్ నిధులను పొరబాటున కేంద్రం ఏపీకి బదిలీ చేసింది. వాటిని తమకు బదిలీ చేయాలని ఇప్పటికే చాలాసార్లు కోరాం. ఇంకా సమస్యను పరిష్కరించలేదు.
* ఏపీ పునర్విభజన చట్టం 56(2) ప్రకారం తెలంగాణకు రావాల్సిన రూ.208 కోట్లను వెంటనే బదిలీ చేయండి.
* ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం.. నిధుల బదిలీ సమస్యను పరిష్కరించండి.
* ఏపీ మధ్య పెండింగ్‌లో ఉన్న పవర్ యుటిలిటీ బకాయిల సమస్యకు పరిష్కారం చూపండి.
* ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేంద్రం కొన్ని బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు దీనికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా నిర్మలా సీతారమన్‌తో భట్టి చర్చించారు.